ఓ ఎమ్మెల్యే.. ఓ ఐఏఎస్‌.. ఓ లవ్‌ స్టోరీ

4 May, 2017 10:41 IST|Sakshi
ఓ ఎమ్మెల్యే.. ఓ ఐఏఎస్‌.. ఓ లవ్‌ స్టోరీ

సివిల్‌ సర్వీసెస్‌ అధికారుల మధ్య ప్రేమలు, పెళ్లిళ్లు కొత్తకాదు. కానీ ఈ కేరళ ప్రేమకథ కాస్త భిన్నం. అతనేమో పూర్తిస్థాయి రాజకీయ నాయ కుడు. ఆమె స్వతంత్రభావాలు కలిగిన యువ అధికారిణి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కె.ఎస్‌.శబరినందన్, తిరువనంతపురం సబ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ దివ్య ఎస్‌ అయ్యర్‌లు ప్రేమలో పడ్డారని గత కొంతకాలంగా కేరళలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చివరకు మంగళవారం శబరినందన్‌ తన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ పిక్‌ను మార్చి దీన్ని ధ్రువీకరించారు.

ఇద్దరూ కలసి ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసి... రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ను ‘కమిటెడ్‌’గా పేర్కొన్నారు. ‘కొంతకాలంగా తెలిసిన వారందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు. నేనిప్పుడదే విషయాన్ని సంతోషంగా వెల్లడిస్తున్నాను. సబ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ దివ్య ఎస్‌ అయ్యర్‌ను తిరువనంతపురంలో కలిశాను. సాన్నిహిత్యం పెరిగాక తెలిసింది మా ఇద్దరి ఆలోచనలు, ఆసక్తులు, దృక్పథాలు ఒకటేనని. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో దివ్య త్వరలో నా జీవిత భాగస్వామి కాబోతోంది. మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని 33 ఏళ్ల శబరినందన్‌ పోస్ట్‌ చేశారు. పెళ్లి వచ్చేనెలలో ఉండొచ్చు. మాజీ స్పీకర్, దివంగత కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జి.కార్తికేయన్‌ కుమారుడు శబరినందన్‌.

ఎంబీఏ చదివిన ఆయన టాటా ట్రస్ట్‌లో పనిచేసేవారు. తండ్రి మరణంతో 2015లో అరువిక్కర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016లో మళ్లీ గెలిచారు. సీఎంసీ వేలూర్‌ కాలేజీలో మెడిసిన్‌ చదివిన దివ్య 2013లో ఐఏఎస్‌ సాధించారు. మరో విశేషమేమిటంటే శబరినందన్‌ తండ్రి కార్తికేయన్‌ పెళ్లి కూడా అప్పట్లో సంచలనమే. కాలేజీ ప్రొఫెసర్‌ ఎం.టి.సులేఖను ప్రేమించారు కార్తికేయన్‌. ఇరు కుటుంబాలు అభ్యంతరం చెప్పడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకథ ఆధారంగా మమ్ముట్టి హీరోగా సినిమా కూడా వచ్చిందడోయ్.

మరిన్ని వార్తలు