52వ సారి బదిలీ అయిన ఐఏఎస్ అధికారి

4 Mar, 2019 09:14 IST|Sakshi

చండీగఢ్‌ : హర్యానా ప్రభుత్వం తొమ్మిది మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ చేపట్టింది. అందులో 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ అధికారి అశోక్‌ ఖేమ్కా ఒకరు. 2012లో కాంగ్రెస్‌ నాయకురాలు సోనియ గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు, డీఎల్‌ఎఫ్‌కు మధ్య కుదిరిన భూ ఒప్పందాన్ని ఆయన రద్దు చేశారు. దీంతో అప్పట్లో అశోక్‌ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హరియణా మాజీ సీఎం భూపేందర్‌ సింగ్‌ హుడా పాలనలో చోటుచేసుకున్న అనేక కుంభకోణాలను బయటపెట్టారు. నిజాయితీ, కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే సాహసం చేసినందుకు పలువురు ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులకు దిగిన కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. ఆయన నిజాయితీ ముందు ఇవేమి నిలవలేకపోయాయి. అంకిత భావంతో ఆయన చేసిన సర్వీస్‌కు ట్రాన్స్‌ఫర్లు బహుమానాలుగా నిలిచాయి.

అయితే తాజాగా అశోక్‌ ఆరావళీ పర్వత శ్రేణుల్లో భూ ఏకీకరణ గురించి ఆయన మాట్లాడిన మాటలు ఓ జాతీయ పత్రికలో ప్రచురితమైన కొన్ని గంటల్లోనే ఈ బదిలీ జరిగింది. అయితే బదిలీ అనేది అశోక్‌కు పరిపాటిగా మారిందనే చెప్పవచ్చు.. తన 27 ఏళ్ల సర్వీస్‌లో ఆయన 50 సార్లకు పైగా బదిలీ అయ్యారు. నీతిగా, నిజాయితీగా పనిచేసే అధికారులపై ఇలాంటి బదిలీలు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు.

15 నెలలుగా హర్యానా క్రీడా, యువజన విభాగంలో సేవలు అందించిన అశోక్‌ను ప్రస్తుతం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎస్‌ దేశీ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయనతో పాటు బదిలీ అయినవారిలో సిద్ధినాథ్‌ రాయ్‌, రాజీవ్‌ అరోరా, అపూర్వ కుమార్ సింగ్‌, అమిత్‌ కుమార్‌ అగర్వాల్‌, వాజీర్‌ సింగ్‌ గోయత్‌, చందర్‌ శేఖర్‌ విజయ్‌కుమార్ సిద్దప్పలు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు