మార్కులే జీవితం కాదు.. వైరలవుతోన్న ఐఏఎస్‌ ట్వీట్‌

15 Jul, 2020 11:07 IST|Sakshi

గాంధీనగర్‌: ‘మార్కులే జీవితం కాదు.. వందేళ్ల నీ జీవితాన్ని వంద మార్కులు నిర్ణయించలేవు’ వంటి మాటలు చాలాసార్లు వినే ఉంటాం. కానీ వాస్తవంగా పరిస్థితులు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. సమాజంలో దాదాపు 99శాతం ప్రజలు మార్కుల ఆధారంగానే పిల్లల తెలివితేటలను, జీవితాన్ని అంచాన వేస్తారు. బాగా చదివే పిల్లలతో పోల్చి తిడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఓ ఐఏఎస్‌ అధికారి చేసిన ట్వీట్‌ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. సాధారణంగా ఐఏఎస్‌ అయ్యాడంటే చాలా తెలివితేటలు.. చదువులో టాప్‌ అనే భావం మనలో చాలా మందికి ఉంటుంది. కానీ ఈ ఐఏఎస్‌ను చూస్తే ఆ ఆలోచనలన్ని పటాపంచలవుతాయి. ఎందుకంటే ఈ అధికారి ఇంటర్‌ రసాయన శాస్త్రంలో కేవలం 24 మార్కులు తెచ్చుకుని జస్ట్‌ పాసయ్యాడు అంతే.

అమ్దావాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, అహ్మదాబాద్‌ స్మార్ట్ సిటీ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న నితిన్‌ సంగ్వాన్‌ తన సీబీఎస్‌ఈ ఇంటర్‌ మార్క్స్‌ మెమోను ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘సీబీఎస్‌ఈ ఇంటర్‌ పరీక్షల్లో నాకు కెమిస్ట్రీలో 24 మార్కులే వచ్చాయి. పాస్‌ మార్కుల కంటే ఒక్క మార్కు ఎక్కువ వచ్చింది. అయితే నా జీవితంలో నేను ఏం కావాలనుకుంటున్నానో ఈ మార్కులు నిర్ణయించలేదు. అందుకే మార్కుల భారాన్ని పిల్లల మీద మోపి వారిని బాధ పెట్టకండి. బోర్డు ఫలితాల కంటే జీవితం చాలా విలువైనది. రిజల్ట్‌ అనేది ఆత్మపరిశీలనకు అవకాశంగా భావించండి.. విమర్శించడానికి కాదు’ అంటూ ట్వీట్‌ చేశారు నితిన్‌. ప్రస్తుతం ఈ ట్వీట్‌ తెగ వైరలవుతోంది.
 

మరిన్ని వార్తలు