యువకున్ని చితకబాదిన ఐఏఎస్‌ అధికారి

7 Jan, 2019 19:48 IST|Sakshi

కోల్‌కతా : తన భార్యపై సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు చేసినందుకు ఓ యువకున్ని పోలీస్‌ స్టేషన్‌లోనే చితకబాదాడు పశ్చిమబెంగాల్‌కి చెందిన ఐఏఎస్‌ అధికారి. యువకుడు క్షమించమని వేడుకున్నా పట్టించుకోకుండా చితక్కొట్టారు. ఇప్పుడా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అలీపూర్‌ద్వార్ జిల్లాకు చెందిన ఐఏఎస్‌ అధికారి నిఖిల్‌ నిర్మల్‌ భార్యపై అదే ప్రాంతానికి చెందిన వినోద్‌ కుమార్‌ సర్కార్‌ అనే యువకుడు సోషల్‌ మీడియాలో అసభ్యకర కామెంట్లు చేశాడు. దీంతో ఆ యువకుడిపై నిఖిల్‌ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని యువకున్ని అరెస్ట్‌ చేశారు. కాగ గత ఆదివారం ఐఏఎస్‌ అధికారి నిఖిల్‌ తన భార్య నందిని కిషన్‌తో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు.

ఆవేశంతో ఆ యువకున్ని చితకబాదాడు. క్షమించండి అంటూ ఆ యువకుడు ప్రాధేయపడుతున్నా వినలేదు. అధికారి భార్య కూడా యువకున్ని కొట్టారు. ఇదంతా అక్కడ ఉన్నవారిలో ఒకరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్‌ అయింది. 

కాగా ఓ ఐఏఎస్‌ అధికారి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి యువకున్ని కొట్టడాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పుబట్టారు. పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి కొట్టడానికి ఐఏఎస్‌కి హక్కులేదని ఏపీడీఆర్‌ సభ్యురాలు జతీశ్వర్‌ భారతి అన్నారు. తన భార్యపై సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సమాచారం ఇవ్వాలి కానీ, ఆయన వెళ్లి కొట్టడం ఏంటని ప్రశ్నించారు. చట్టం ప్రకారం వ్యవహరించాలి కానీ భార్యతో కలిసివెళ్లి కొట్టడం, చంపేస్తానని బెదిరించడం నేరమని ఆమె పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై వివరణ కోసం ఐఏఎస్‌ అధికారిని మీడియా సంప్రదించగా అందుబాటులోని రాలేదు.

మరిన్ని వార్తలు