సెన్సార్‌బోర్డుగా మారిన ‘ఐ అండ్‌ బీ’

2 May, 2018 13:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో పత్రికా స్వేచ్ఛ రోజు రోజుకు హరించుకుపోతోంది. ప్రభుత్వం, రాజకీయ నాయకులు, సంఘ్‌ పరివారం చేతుల్లో అణచివేతకు గురవుతోంది. 2018లోకి ప్రవేశించిన నాలుగు నెలల్లోనే పత్రికా స్వేచ్ఛపై అణచివేత ఎంతగానో ఉందని, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ పత్రికా స్వేచ్ఛను నియంత్రించడంలో సెన్సార్‌ సంస్థగా ఎంతో క్రియాశీలక పాత్ర పోషించిందని మీడియా వాచ్‌డాగ్‌ ‘ది హూట్‌’ ఓ నివేదికలో వెల్లడించింది. బుధవారం నాడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నివేదికను విడుదల చేసింది. 

మీడియాను పర్యవేక్షించేందుకు కేంద్ర ఐబీ శాఖ ఎన్నో ప్రక్రియలను ప్రకటించి జర్నలిస్టుల గొడవతో ఒక నిర్ణయాన్ని మాత్రమే వెనక్కి తీసుకుందని నివేదిక తెలిపింది. 2018 జనవరి ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు, నాలుగు నెలల్లో పత్రికా స్వేచ్ఛ అణచివేతకు సంబంధించి వంద సంఘటనలు జరిగాయని పేర్కొంది. వాటిల్లో మూడు సంఘటనల్లో జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. 21 సంఘటనల్లో దాడులు, బెదిరింపులు, అరెస్ట్‌లు ఉన్నాయి. 

2017లో దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై జరిగిన దాడులకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన తప్పుడు లెక్కలను కూడా ‘ది హూట్‌’ నివేదిక ప్రస్తావించింది. తాము అన్ని విధాల పునర్‌ పరిశీలించామని, 2017లో దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై 46 దాడులు జరిగాయని స్పష్టం చేసింది. 2017లో జర్నలిస్టులపై 15 దాడులు మాత్రమే జరిగాయని కేంద్ర మంత్రి హన్సరాజ్‌ అహిర్‌ రాజ్యసభకు ఫిబ్రవరిలో తెలిపారు. ఈ దాడులకు సంబంధించి 26 మందిని అరెస్ట్‌ చేశామని కూడా ఆయన చెప్పారు. జర్నలిస్టులపై ఎవరు దాడులు చేశారన్న దానికి కేంద్ర హోం శాఖ వద్ద సమాచారం లేదని, కానీ తమ వద్ద సమాచారం ఉందని ‘ది హూట్‌’ పేర్కొంది. 

మూడు సంఘటనల్లో పోలీసులే దాడులు జరిపించగా, మరో మూడు సంఘటనల్లో సంఘ్‌ పరివార్‌ సంస్థలు దాడులు జరిపించాయని, మరో మూడు సంఘటనల్లో బెదిరింపులకు కూడా సంఘ్‌ పరివార్‌ సంస్థలే కారణమని ఆరోపించింది. దేశంలో ఇప్పటికే 25 చోట్ల ఇంటర్నెట్‌ సర్వీసులను ప్రభుత్వం అడ్డుకుందని కూడా తెలిపింది. 180 దేశాల పత్రికా స్వేచ్ఛ సూచికలో గతేడాది భారత్‌ 136వ స్థానంలో ఉండగా, అది ఈ ఏడాదికి 138వ స్థానానికి పడిపోయిన విషయం ఇటీవలనే వెల్లడైంది. 
 

మరిన్ని వార్తలు