ఐబీఎంలో 5వేల మందికి ఉద్వాసన!

28 Jan, 2015 14:27 IST|Sakshi

బెంగళూరు : మరో సాప్ట్వేర్ సంస్థ.. పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రముఖ అంతర్జాతీయ కంప్యూటర్ సాప్ట్వేర్ సంస్థ ఐబీఎం కంపెనీ త్వరలో ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా ఐబీఎం వడివడిగా అడుగులు వేస్తుంది. భారత్లో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న దాదాపు 5 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీ తన ప్రయత్నాలు  ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఐబీఎం సంస్థ కొత్త సాంకేతికను అందిపుచ్చుకునే నేపథ్యంలో..  పెరిగే మార్జిన్ ఒత్తిళ్లను, పెరుగుతున్న ఆదాయం, క్లౌడ్ కంప్యూటింగ్ ను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది.   దాంతో  భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఐబీఎం ఈ చర్యలను తీసుకున్నట్లు తెలిసింది. ఐబీఎంలో సుమారు 398,455 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐబీఎం సంస్థలో పనిచేస్తున్న.. ఔట్‌సోర్సింగ్, కన్సల్టింగ్ సర్వీసులతో సహా అన్ని విభాగాల్లోను ఈ తొలగింపులు ఉండవచ్చని ఆ వర్గాలు తెలిపాయి.

ఐబీఎంకు చెందిన ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ ప్రతినిధి ఈ ఉద్యోగుల తొలగింపుపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. అలాగే ఈ ఏడాదిలో ఎంత మందిని తొలగించనున్నారనే వివరాలను కూడా వెల్లడించలేదు. అయితే కంపెనీ తన ఖర్చులను తగ్గించి ఉత్పత్తులను పెంచేందుకు ప్రణాళిక చేస్తోందన్నారు.

కాగా, ఐబీఎం కంపెనీకి మూడో వంతు ఆదాయం విదేశాల నుండే ఎక్కువగా వస్తోంది. ప్రత్యేకించి ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్న భారత్, చైనాల్లో ఐబీఎం విస్తృతంగా తన కార్యకలాపాలను సాగిస్తోంది. అదలా ఉంచితే... ఇటీవల న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో ఐబీఎం షేర్ విలువ 0.42 శాతం క్షీణించి 97.95 డాలర్లకు పడిపోయింది.

>
మరిన్ని వార్తలు