గంగా జలంతో చికిత్స.. నో చెప్పిన ఐసీఎంఆర్‌

8 May, 2020 10:42 IST|Sakshi

ఎన్‌ఎంసీజీ ప్రతిపాదన తిరస్కరించిన ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ: కరోనా పేషెంట్ల చికిత్సకు గంగా జలాన్ని ఉపయోగించే అధ్యయనాన్ని పరిశీలించాలన్న జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) తిరస్కరించింది. గంగా జలంతో రోగాలు నయమవుతాయనడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం, ఆధారాలు సరిపోవని స్పష్టం చేసింది. కాబట్టి గంగా జలంతో క్లినికల్‌ పరీక్షలకు సంబంధించిన అధ్యయనం చేయలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఎవల్యూషన్‌ ఆఫ్ రీసెర్చ్‌ ప్రపోజల్స్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ వైకే గుప్తా నేతృత‍్వంలోని బృందం తమ నిర్ణయాన్ని వెల్లడించింది. కాగా పవిత్ర గంగా జలంతో వివిధ రోగాలు నయమైనట్లు పురాణాలు చెబుతున్నాయని మాజీ సైనిక అధికారులు ఏర్పాటు చేసిన ఓ సంస్థ పేర్కొంది. నింజా వైరస్‌గా పేర్కొనే గంగా జలానికి బాక్టీరియాను చంపే శక్తి ఉందని గతంలో నిరూపితమైనట్లు పేర్కొంది. (‘ప్లాస్మా’పై 21 సంస్థలకు అనుమతి)

ఈ నేపథ్యంలో కరోనా క్లినికల్‌ అధ్యయనానికి గంగా జలాన్ని ఉపయోగిస్తే బాగుంటుందని ఈ మేరకు జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని గంగా ప్రక్షాళన జాతీయ మిషన్‌(ఎన్‌ఎంసీజీ)కు లేఖ రాసింది. స్వచ్ఛమైన గంగా జలంలో వైరస్‌తో పోరాడే యాంటీ వైరల్‌ గుణం ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల్లో తమ సూచనను పరిగణనలోకి తీసుకోవాలని ఏప్రిల్‌  28న విన్నవించింది. ఈ లేఖను ఎన్‌ఎంసీజీ ఐసీఎంఆర్‌కు పంపగా... తాజాగా ఈ విషయంపై చర్చించిన ఐసీఎంఆర్‌ పరిశోధకులు మాజీ సైనికుల ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ మేరకు ఎంకే గుప్తా మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత ప్రతిపాదనలకు బలం చేకూర్చేందుకు మరింత శాస్త్రీయ సమాచారం, సాక్ష్యాలు కావాలి. ఈ విషయాన్ని మేము ఎన్‌ఎంసీజీకి తెలిపాం’’అని పేర్కొన్నారు. అయితే ప్రతిపాదనల అంశమై తమకు ఐసీఎంఆర్‌ నుంచి ఎటువంటి సమాచారం అందలేదని ఎన్‌ఎంసీజీ అధికారులు పేర్కొనడం గమనార్హం.(ఆయుర్వేద ప్రభావమెంత?)

మరిన్ని వార్తలు