వృద్ధుల హక్కులను గుర్తించాలి: సుప్రీం

14 Dec, 2018 01:15 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని వృద్ధులకు ఉన్న చట్టబద్ధమైన హక్కులను గుర్తించి, వాటిని అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వృద్ధాశ్రమాల వివరాలను తమ ముందుంచాలని కేంద్రాన్ని కోరింది. వృద్ధుల సంక్షేమంపై సంజీవ్‌ పాణిగ్రాహి, సీనియర్‌ న్యాయవాది అశ్వినీ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం..‘వృద్ధుల గౌరవం, ఆశ్రయం, ఆరోగ్యంతో జీవించే హక్కును రక్షించటానికి, అమలు చేయటానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి’అని పేర్కొంది. వృద్ధాప్య పింఛను విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలని పేర్కొంది.

దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో వృద్ధులకు వైద్య సదుపాయాలు, వృద్ధాప్య వ్యాధుల చికిత్సా నిపుణులు ఎందరున్నారో తెలపాలని కోరింది. ‘తల్లిదండ్రులు, వృద్ధుల సంక్షేమ, నిర్వహణ చట్టం–2007 సరిగ్గా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. వృద్ధుల హక్కుల పరిరక్షణ సక్రమంగా అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, చర్యలు తీసుకోవాలి’అని ఆదేశించింది. జనవరి 31వ తేదీలోగా కేంద్రం సమాధానాలు తెలియజేయాలని కోరుతూ కేసును వాయిదా వేసింది. కాగా, 2011 లెక్కల ప్రకారం దేశంలో 10.38 కోట్ల మంది వృద్ధులుండగా 2026 నాటికి వీరి సంఖ్య 17.3 కోట్లకు చేరుకుంటుందని అంచనా.   

మరిన్ని వార్తలు