మీతో కలసి పనిచేయాలనుకుంటున్నా

12 Jun, 2014 05:43 IST|Sakshi
మీతో కలసి పనిచేయాలనుకుంటున్నా

మోడీకి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ లేఖ
 
న్యూఢిల్లీ: ఇటీవలి తన భారత పర్యటన, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తన భేటీ పట్ల పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇరుదేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలపై మీతో కలసి చర్చించేందుకు సానుకూల దృక్పథంతో ఎదురు చూస్తున్నానని అందులో పేర్కొన్నారు. ఈ లేఖ గత వారాంతంలో ప్రధానమంత్రి కార్యాలయానికి చేరింది. మే 26న జరిగిన మోడీ ప్రమాణ స్వీకారానికి నవాజ్ షరీఫ్ హాజరవడం, ఆ మరుసటి రోజున ఆయనతో మోడీ సమావేశమై ద్వైపాక్షిక అంశాలతోసహా పలు విషయాలపై చర్చించడం తెలిసిందే.
 
 ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై మనం పరస్పరం వ్యక్తం చేసుకున్న అర్థవంతమైన ఆలోచనలతో సంతృప్తిగా తాను స్వదేశానికి మరలానని లేఖలో నవాజ్ పేర్కొన్నారు. ‘‘ఇరుదేశాలకు ప్రయోజనం కలిగించేలా అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే విషయంలో మీతో కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా. మనం చేసే ప్రయత్నాలు మరింత మెరుగైన భవిష్యత్తుకు పునాది వేయగలవని ఆశిస్తున్నా’’ అని నవాజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇరుదేశాల్లోనూ లక్షలాది మంది పేదరికంలో మగ్గుతున్నారని, వారిపై మనం దృష్టి సారించాల్సి ఉందని అంటూ.. మనం చేపట్టే నిర్మాణాత్మక చర్యలు ఇరుదేశాల సంక్షేమానికి, సౌభాగ్యానికి దోహదం చేయగలవని తాను బలంగా నమ్ముతున్నానని పాక్ ప్రధాని పేర్కొన్నారు.
 

>
మరిన్ని వార్తలు