సభలోనే బిల్లు పేపర్లు చించేసిన అసదుద్దీన్‌

9 Dec, 2019 19:39 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సోమవారం లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పౌరసత్వ (సవరణ) బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందితే.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పేరును నియంత హిట్లర్‌, డేవిడ్ బెన్ గురియన్ పక్కన కనిపిస్తోందని కొత్త వివాదానికి తెర తీశారు. సోమవారం లోక్‌సభలో ఎంపీ అసదుద్దీన్‌ మాట్లాడుతూ.. 'పౌరసత్వ (సవరణ) బిల్లు నుంచి దేశాన్ని రక్షించండంతో పాటు హోంమంత్రిని కూడా రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే జర్మనీలో జాతి ప్రాతిపదికపై ఏర్పాటు చేసిన నురెమ్‌బర్గ్‌ చట్టాలు, ఇజ్రాయెల్ పౌరసత్వ చట్టాలు చేసిన హిట్లర్, డేవిడ్ బెన్ మాదిరిగా హోంమంత్రి అమిత్‌షా పేరు వారి జాబితాలో చేరుతుంది' అని ఒవైసీ లోక్‌సభలో పేర్కొన్నారు.


అంతేకాక సర్బానంద సోనోవాల్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును పౌరసత్వ(సవరణ) బిల్లు ఉల్లంఘిస్తుందని అసదుద్దీన్‌ అన్నారు. ఈ బిల్లు రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకమని, ప్రాథమిక హక్కులను కాలరాస్తుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రాథమికంగా బలపరిచిన లౌకికవాదాన్ని కాకుండా కేంద్రం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తుందని అందుకే తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అయితే అసదుద్దీన్‌ వ్యాఖ్యలను స్పీకర్‌ ఓం బిర్లా తప్పుపట్టారు. సభలో అమర్యాదగా మాట్లాడరాదని అసదుద్దీన్‌కు సూచించారు. అసదుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిసున్నట్టు పేర్కొన్నారు. ఇక మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న  పౌరసత్వ (సవరణ) బిల్లును అమిత్‌షా సోమవారం ఉదయం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే మతప్రాతిపదిక పౌరసత్వాన్ని కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, సీపీఎం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

కంటతడి పెట్టిన ఒవైసీ..
అలాగే లోక్‌సభలో పౌరసత్వ బిల్లు సందర్భంగా మాట్లాడిన ఒవైసీ.. ఈ బిల్లు ద్వారా దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అనంతరం సభలోనే బిల్లు పేపర్లు చించేశారు. అలాగే ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు