ప్రాంతీయ భాషలైతే మరింతమంది యూజర్లు

23 Mar, 2018 14:06 IST|Sakshi

న్యూ ఢిల్లీ : ఇంటర్‌నెట్‌ వచ్చాక ప్రపంచమే ఓ కుగ్రామంగా మారింది. అంతా డిజిటలైజేషన్‌ అయిపోయింది. అయినా నేటికి ఎంతోమంది ఇంటర్‌నెట్‌ను వినియోగించలేని వారు ఉన్నారు. అందుకు ప్రధాన కారణం ఇంటర్‌నెట్‌లో ప్రాంతీయ భాషలను వాడే అవకాశం ఉండదు. ఐఏఎంఏఐ, కంతార్‌ ఐఎంఆర్‌బీ వారి రిపోర్టు ప్రకారం ఒకవేళ ఇంటర్నేట్‌లో ప్రాంతీయ భాషలు ఉపయోగించుకొనే వీలుంటే దాదాపు 205 మిలియన్ల నాన్‌-యూజర్లు కూడా ఇంటర్నెట్‌కు లాగ్‌ ఆన్‌ అవుతారని వెల్లడించింది. ‘ఇంటర్నెట్‌ ఇన్‌ ఇండిక్‌’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో ప్రస్తుతం భారతదేశంలో నగరాల్లో 193 మిలియన్లు, గ్రామీణ ప్రాంతాల్లో 141 మిలియన్ల మంది ఇంటర్నెట్‌ యూజర్లు ఉన్నారని తెలిపింది. 2017, డిసెంబరు నాటికి దేశంలో 481 మిలియన్ల ఇంటర్నెట్‌ యూజర్లు ఉన్నట్లు పేర్కొంది.

ఒకవేళ ఇంటర్నెట్‌ సమాచారం ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటే ప్రస్తుతం ఉన్న నాన్‌-యూజర్లలో 23 శాతం మంది ఇంటర్నెట్‌ను వినియోగించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌ సమాచారం పూర్తిగా ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. మెట్రో నగరాల వారికి ఇది సౌలభ్యంగానే ఉంటుంది. కానీ సమాజంలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలవారు, చదువులేని వారు, వెనకబడిన వారే. వారంతా ఇంటర్నెట్‌ వాడాలంటే ప్రాంతీయ భాషలు ఉపయోగించే వీలుండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ యూజర్లు 20 శాతం కన్నా తక్కువగా ఉన్నారు.

డిజిటలైజేషన్‌ను పూర్తి స్థాయిలో సాధించాలన్నా, వీరిని ఇంటర్నెట్‌ వాడేలా చేయాలన్నా సమాచారం ఏ భాషలో లభిస్తుందనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఈ ‘ఇండిక్‌ అప్లికేషన్‌’(భారతీయ భాషల్లో సెర్చ్‌ ఆప్షన్‌)లో మ్యూజిక్‌, పాటలతో పాటు ఈ-మెయిల్‌, చాటింగ్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఇంటర్నెట్‌ ద్వారా ఆన్‌లైన్‌ సెర్చింగ్‌, టికెట్‌ బుకింగ్‌, జాబ్‌ సెర్చింగ్‌ వంటివే ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిల్లో కూడా ప్రాంతీయ భాషలు తక్కువగానే వినియోగిస్తున్నారు. 

మరిన్ని వార్తలు