రూ.10వేలకే ఆక్సిజన్‌ యంత్రం! 

26 Apr, 2020 13:46 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే లక్ష్యంతో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన యంత్రాన్ని తయారు చేశారు. పరిసరాల్లోని గాల్లోంచి శుద్ధమైన ఆక్సిజన్‌ను తయారుచేసే ఈ యంత్రం గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఒక్కొక్కటి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ఖరీదు చేస్తాయి. అయితే అందుబాటులో ఉన్న పదార్థాలతోనే చౌకైన ఆక్సిజన్‌ ఉత్పత్తి యంత్రాన్ని తయారుచేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని ఐఐఎస్‌సీ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ప్రవీణ్‌ రామమూర్తి గుర్తించారు. ఇందుకు తగ్గట్టుగా డాక్టర్‌ అరుణ్‌రావు, కె.భాస్కర్‌తో కలిసి పదివేల రూపాయలు ఖరీదుచేసే ఆక్సిజన్‌ తయారీ యంత్రాన్ని సిద్ధం చేశారు. 

మనం పీల్చే గాలిలో నైట్రోజన్‌ ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. కచ్చితంగా చెప్పాలంటే దాదాపు 78 శాతం నైట్రోజన్‌ ఉంటే 21 శాతం ఆక్సిజన్‌ ఉంటుంది. మిగిలిన ఒక శాతంలో కొన్ని ఇతర వాయువులు ఉంటాయి. ఈ గాలి ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన యంత్రంలోకి ప్రవేశించినప్పుడు అవి జియోలైట్‌ అనే పదార్థం గుండా ప్రయాణిస్తాయి. చౌకగా లభించే ఈ జియోలైట్‌ గాల్లోని నైట్రోజన్‌ను పీల్చుకునే లక్షణం కలది. అంటే.. యంత్రం నుంచి బయటకు వచ్చే గాలిలో ఆక్సిజన్‌ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ యంత్రాన్ని తయారు చేసిన తరువాత మార్కెట్‌లో లభించే వాటర్‌ ఫిల్టర్లను ఉపయోగించి దాన్ని జియోలైట్‌తో నింపారు. ప్రస్తుతం ఈ యంత్రం ద్వారా 70 శాతం స్వచ్ఛతతో కూడిన ఆక్సిజన్‌ వెలువడుతుండగా.. దీన్ని 90 శాతానికి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యంత్రం నిర్వహణకు తాము అర్డినో కంప్యూటర్‌ బోర్డులను వాడామని ప్రొఫెసర్‌ రామమూర్తి తెలిపారు.

మరిన్ని వార్తలు