అత్యుత్తమ విద్యాసంస్థ ఐఐఎస్‌సీ

4 Apr, 2018 02:33 IST|Sakshi

ఇంజనీరింగ్‌లో మద్రాస్‌ ఐఐటీ, మేనేజ్‌మెంట్‌లో ఐఐఎం–ఏ టాప్‌

విద్యాసంస్థల ర్యాంకులు విడుదల చేసిన జవదేకర్‌  

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) నిలిచింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌) ద్వారా దేశంలోని వివిధ విద్యా సంస్థలకు ఇచ్చిన ర్యాంకులను ఆ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మంగళవారం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యాసంస్థలకు మొత్తం 9 విభాగాల్లో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకులు కేటాయించింది. సమగ్ర (ఓవరాల్‌) ఉత్తమ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, మెడికల్, ఆర్కిటెక్చర్, లా, కళాశాలలు అనే 9 విభాగాల వారీగా ర్యాంకులు విడుదలయ్యాయి.

గతేడాది మాదిరిగానే ఇప్పుడు కూడా ఓవరాల్‌తోపాటు విశ్వవిద్యాలయాల విభాగంలోనూ ఐఐఎస్‌సీ తొలిస్థానం సాధించింది. అత్యుత్తమ ఇంజినీరింగ్‌ విద్యాసంస్థగా ఐఐటీ–మద్రాస్, అత్యుత్తమ మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థగా ఐఐఎం–అహ్మదాబాద్, అత్యుత్తమ వైద్య విద్యాసంస్థగా ఢిల్లీలోని ఎయిమ్స్‌ నిలిచాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 301 విశ్వవిద్యాలయాలు, 906 ఇంజినీరింగ్, 487 మేనేజ్‌మెంట్, 286 ఫార్మసీ, 101 వైద్య, 71 లా, 59 ఆర్కిటెక్చర్‌ విద్యాసంస్థలతోపాటు 1087 సాధారణ డిగ్రీ కళాశాలలను అనేక అంశాలవారీగా పరిశీలించిన అనంతరం ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ఈ ర్యాంకులు ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలూ ర్యాంకుల కేటాయింపు కోసం ఎన్‌ఐఆర్‌ఎఫ్‌కు దరఖాస్తులు పంపించాల్సిందేననీ, లేకుంటే వాటికి నిధులను నిలిపేస్తామని జవదేకర్‌ చెప్పారు. 

ఓవరాల్‌ కేటగిరీలో టాప్‌–5 
1.ఐఐఎస్‌సీ–బెంగళూరు, 2.ఐఐటీ–మద్రాస్, 3.ఐఐటీ–బాంబే, 4.ఐఐటీ–ఢిల్లీ, 5.ఐఐటీ–ఖరగ్‌పూర్‌ 
ఇంజనీరింగ్‌ విద్యలో టాప్‌–5 
1.ఐఐటీ–మద్రాస్, 2.ఐఐటీ–బాంబే, 3.ఐఐటీ–ఢిల్లీ, 4.ఐఐటీ–ఖరగ్‌పూర్, 5.ఐఐటీ–కాన్పూర్‌ 
వైద్యవిద్యలో టాప్‌–5 
1.ఎయిమ్స్‌–ఢిల్లీ, 2.పీజీఐఎంఈఆర్‌–చండీగఢ్, 3.సీఎంసీ–వేలూరు, 4.కేఎంసీ–మణిపాల్, 5.కేజేఎంయూ–లక్నో 
మేనేజ్‌మెంట్‌ విద్యలో టాప్‌–5 
1.ఐఐఎం–అహ్మదాబాద్, 2.ఐఐఎం–బెంగళూరు, 3.ఐఐఎం–కలకత్తా, 4.ఐఐఎం–లక్నో, 5.ఐఐటీ–బాంబే 
న్యాయ విద్యలో టాప్‌–5 
1.ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ–బెంగళూరు, 2.ఎన్‌ఎల్‌యూ–ఢిల్లీ, 3.నల్సార్‌ యూనివర్సిటీ–హైదరాబాద్, 4.ఐఐటీ–ఖరగ్‌పూర్, 5.ఎన్‌ఎల్‌యూ–జోధ్‌పూర్‌ 
ఫార్మసీ విద్యలో టాప్‌–5 
1.ఎన్‌ఐపీఈఆర్‌–మొహాలీ, 2.జామియా హందర్ద్‌–ఢిల్లీ,3.పంజాబ్‌ యూనివర్సిటీ–చండీగఢ్, 4.ఐసీటీ–ముంబై, 5.బిట్స్‌–పిలానీ 
టాప్‌–5 విశ్వవిద్యాలయాలు:

1.ఐఐఎస్‌సీ–బెంగళూరు, 2.జేఎన్‌యూ–ఢిల్లీ, 3.బీహెచ్‌యూ–వారణాసి, 4.అన్నా యూనివర్సిటీ–చెన్నై, 5.హైదరాబాద్‌ కేంద్రీయ వర్సిటీ. 

మరిన్ని వార్తలు