'కోట'లో 12వ ఆత్మహత్య

24 Jul, 2016 11:27 IST|Sakshi
'కోట'లో 12వ ఆత్మహత్య

కోట: ఐఐటీ, మెడికల్ ప్రవేశ పరీక్షల శిక్షణకు దేశంలోనే పేరుగాంచిన కోట(రాజస్థాన్)లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ శిక్షణా కేంద్రాల్లో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు తరచూ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా బిహార్‌లోని మోతిహరి జిల్లాకు చెందిన ప్రిన్స్ కుమార్ సింగ్ అనే విద్యార్థి కోటలోని తన గదిలో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఏడాది కోటలో ఇది 12వ ఆత్మహత్య.

ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు ప్రిపేరవుతున్న కుమార్ సింగ్ ఆత్మహత్యకు కొద్దినిమిషాల ముందు తల్లిదండ్రులతో మాట్లాడాడని విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రాధాకృష్ణ తెలిపారు. అతడి గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యంకాలేదన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి, దర్యాప్తు చేపట్టామని చెప్పారు. జూలై 5న బిహార్ కే చెందిన నిఖిల్ కుమార్ అనే మెడికల్ శిక్షణ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే నెలలో బిహార్ కు చెందిన విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని వార్తలు