ఆ ఐఐటీ పిల్లలు రోజూ స్నానం చేయరట!

1 Sep, 2016 12:32 IST|Sakshi
ఆ ఐఐటీ పిల్లలు రోజూ స్నానం చేయరట!

ఐఐటీ బాంబే విద్యార్థులలో ప్రతి పదిమందిలో ఆరుగురు వారానికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే స్నానం చేస్తారట. ఇంకా కొంతమంది.. అంటే 10 శాతం మంది అయితే వారానికి ఒక్కసారి మాత్రమే స్నానం చేస్తారు. మరి ప్రతిరోజూ స్నానాలు చేసేవాళ్లు ఎంతమంది అంటే, కేవలం 30 శాతం మంది మాత్రమే!! స్వయంగా బాంబే ఐఐటీ విద్యార్థులే నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. అక్కడ చదువు పూర్తిచేసి బయటకు వెళ్లిన 332 మంది అభ్యర్థుల నుంచి ఈ తరహా ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు తీసుకున్నారు.

హాస్టళ్లలో తమ రూమ్మేట్లతో మరికొంత కాలం కలిసుంటే బాగుంటుందని 40 శాతం మంది భావిస్తుంటే, సొంత ఇళ్లకు వెళ్లిపోవాలని 27 శాతం మంది అనుకుంటున్నారు. ఒక్క శాతం మాత్రం ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు. ఇక చిన్ననాటి స్నేహితులతో సంబంధాల గురించి అడిగినప్పుడు 66 శాతం మంది చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెబితే 29.8 శాతం మంది మాత్రం తమ తల్లిదండ్రులతో కూడా అంతంతమాత్రంగానే మాట్లాడుతున్నారట.

ఐఐటీలో చదివే సమయంలోనే 52.4 శాతం మంది స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లొచ్చారట.70 శాతం మంది లోకల్ రైళ్లలో టికెట్లు లేకుండా వెళతే, 55.7 శాతం మంది ఏదో రకమైన జూదం ఆడారు. మరో ఐదేళ్ల వరకు పెళ్లి చేసుకోవాలని లేదని 31 శాతం మంది ఏమీ చెప్పలేమని, 21.4 శాతం మంది మూడు నుంచి ఐదేళ్ల మధ్యలో చేసుకుంటామన్నారు. సర్వేలో పాల్గొన్నవాళ్లలో 70.5 శాతం మంది బీటెక్ చదవగా, 33.75 శాతం మంది దాంతోపాటు మరో ఆనర్స్ డిగ్రీ కూడా చేశారు.

మరిన్ని వార్తలు