రోబోలతో రోగులకు ఆహారం, మందులు

1 Apr, 2020 14:34 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

ముంబై : కోవిడ్‌-19 రోగులకు సేవలందించేందుకు ఐఐటీ గౌహతికి చెందిన పరిశోధకులు రెండు రోబోలను అభివృద్ధి చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ రోగులకు ఆహారం, మందులు అందించడం, వ్యర్థాలను సేకరించడం వంటి పనులను ఈ రోబోలు చేపడతాయి. ఐసోలేషన్‌ వార్డుల్లో వైద్య సిబ్బందికి వైరస్‌ ముప్పును తగ్గించేందుకు రోబోలు ఉపకరిస్తాయని ఐఐటీ గౌహతికి చెందిన మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ర్టిక్‌ ఇంజనీరింగ్‌ విభాగాలు యోచిస్తున్నాయి. ఆస్పత్రి అవసరాలకు తగిన విధంగా కరోనా రోగులకు ఆహారం, మందులు అందించే రోబోతో పాటు ఐసోలేషన్‌ వార్డుల్లో వైరస్‌ వ్యాప్తి చెందే రిస్క్‌ పొంచి ఉన్న వ్యర్థాల సేకరణ కోసం మరో రోబోను అభివృద్ధి చేయడంపై కసరత్తు చేస్తున్నామని గౌహతి ఐఐటీ టీం ప్రతినిధులు వెల్లడించారు.

రెండు వారాల్లో ఈ రోబోలకు సంబంధించిన నమూనాలు తయారవుతాయని, అనంతరం సంస్థ ఆస్పత్రిలో, వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చే సెంటర్‌ ఆఫ్‌ నానోటెక్నాలజీలో టెస్ట్‌ రన్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఇవి పూర్తయిన తర్వాత రోబో ఆధారిత స్క్రీనింగ్‌ యూనిట్ల తయారీని కూడా చేపట్టే ప్రణాళికలున్నాయని పేర్కొన్నారు. వైరస్‌ను గుర్తించి, చికిత్స అందించేందుకు ఈశాన్య రాష్ట్రాలకు ఉపకరించే రీతిలో కోవిడ్‌-19 విశ్లేషణ కోసం ఆధునిక పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఐఐటీ గౌహతి సంసిద్ధమైంది.

చదవండి: కరోనా వ్యాప్తి: ఐరాస సిబ్బందికి పాజిటివ్‌!

మరిన్ని వార్తలు