అయ్యో.. ఐఐటీ! ఏది ఫ్యాకల్టీ

24 Jul, 2018 01:23 IST|Sakshi

బోధనా సిబ్బంది లేక అల్లాడుతున్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు

విద్యార్థులు భారీగా చేరుతున్నా వెక్కిరిస్తున్న అధ్యాపకుల కొరత

బోధన వైపు ఐఐటీయన్ల అనాసక్తి

అధిక వేతనాలు ఇస్తుండటంతో

బిట్స్, డీఏఐఐసీసీ, ఎంఐటీ వైపు ఎక్కువమంది చూపు

ఐఐటీ కాన్పూర్‌.. జూన్‌ మొదటి వారంలో 12 మంది అధ్యాపకుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది.. 200 మందికి పైగా రాత పరీక్ష నిర్వహించింది.. అందరూ పీహెచ్‌డీ చేసిన వారే. కానీ పరీక్షలో పాసైంది 13 మంది.. అందులో ఉద్యోగానికి ఎంపికైంది ఒకే ఒక్కరు! ఐఐటీ ఖరగ్‌పూర్‌.. జూలై రెండో వారంలో 15 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది.. వచ్చిన దరఖాస్తులు కేవలం నాలుగే. ఐఐటీ గోవా.. ఈ ఏడాది పూర్తిస్థాయిలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించింది. తరగతులు మొదలయ్యాయి. కానీ 62 శాతం అధ్యాపకుల పోస్టులు ఖాళీ! ఐఐటీ బిలాయ్‌.. ఇందులోనూ అదే పరిస్థితి.. విద్యార్థులు ఫుల్‌... 58 శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీ!!


సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్‌ : అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐఐటీలు (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ టెక్నాలజీ)అధ్యాపకుల కొరతతో అల్లాడుతున్నాయి. బోధనా సిబ్బంది నియామకానికి తరచూ నోటిఫికేషన్లు జారీ చేస్తున్నా అర్హులైనవారు దొరకడం గగనమైంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అంతర్జాతీయ నిపుణులను నియమించుకోవచ్చని, వారు ఇక్కడ పని చేయడానికి అవసరమైన వీసాలు జారీ చేయడానికి ఎలాంటి సమస్యా లేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ గత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో వెల్లడించినా పరిస్థితిలో మార్పు కన్పించడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేయడం, పూర్తిస్థాయి ప్రొఫెసర్ల నియామకానికి ఆంక్షలు పెట్టడం కూడా అధ్యాపకుల కొరతకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

2013 నుంచి మారిన పరిస్థితి.. 
ఐఐటీల్లో అధ్యాపకులకు ఇస్తున్న వేతనాలు భారీ స్థాయిలోనే ఉంటాయి. ఒక్కసారి ఈ సంస్థల్లో ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ సదస్సులకు ఆహ్వానాలు అందుతుంటాయి. విద్యార్థులతో కలిసి చేసే పరిశోధనలకు అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కేవి. కానీ ఇదంతా గతం. గత దశాబ్దకాలంగా ఈ పరిస్థితి మారుతోంది. ‘‘2011 దాకా ఐఐటీల్లో ఖాళీలే ఉండేవి కావు. అప్పుడు దేశవ్యాప్తంగా పది లోపే ఐఐటీలు ఉండటం వల్ల ఆ పరిస్థితి ఉండేది. ఇప్పుడు వాటి సంఖ్య 23కు పెరగడంతోపాటు కొత్త కోర్సులు, దానికి తగ్గట్టే విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీంతో 2013లో మొదలైన అధ్యాపకుల కొరత 2015కు వచ్చేసరికి 38 శాతానికి చేరింది’’ అని స్ట్రాటజిక్‌ ఇన్నోవేషన్‌ (న్యూఢిల్లీ) కో–క్రాఫ్టర్‌ అరుణ్‌ కశ్యప్‌ పేర్కొన్నారు. దానికి తోడు వివిధ బ్రాంచీల్లో ఏర్పడ్డ అధ్యాపకుల ఖాళీలకు అర్హులైన వారు దొరకడం లేదని ఖరగ్‌పూర్‌ ఐఐటీలో రీసెర్చ్‌ స్కాలర్‌ పంకజ్‌ మోహన్‌పూరియా వివరించారు. ‘‘ఇటీవల కాలంలో వస్తున్న అభ్యర్థులను నేను స్వయంగా చూశా. వారు ఐఐటీ ఫ్యాకల్టీకి ఏమాత్రం అర్హులు కారు. ఐఐటీకి ఎంపికయ్యే విద్యార్థులు అత్యంత ప్రతిభావంతులు. వారికి బోధించేవారు ఎంత సమర్థవంతంగా ఉండాలో మీరే ఆలోచించండి’’ అని ఆయన పేర్కొన్నారు. 

ఐఐటీయన్ల ‘ఐటీ’ బాట 
పదేళ్ల క్రితం వరకు ఐఐటీలో గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన వారిలో ప్రతి బ్యాచ్‌కు చెందిన 15 శాతం మంది ఫ్యాకల్టీ వైపు వచ్చేవారు. దీంతో అప్పట్లో ఫ్యాకల్టీకి ఇబ్బందులు ఉండేవి కావు. కానీ తర్వాత ఐటీ రంగంలో భారీ ఎత్తున అవకాశాలు రావడం, ఏటా రూ.కోటి అంతకంటే ఎక్కువ వేతనాలు ఆఫర్‌ చేస్తుండటంతో ఐఐటీయన్లు బోధన వైపు దృష్టి సారించడం లేదని మూడున్నర దశాబ్దాలపాటు ఐఐటీ ఫ్యాకల్టీగా పనిచేసి పదవీ విరమణ పొందిన హెచ్‌సీ వర్మ అన్నారు. ఐఐటీల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు అవసరమైతే చట్టపరంగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అంటున్నారు. లేకుంటే భవిష్యత్‌లో ఇది అనేక అనర్థాలకు దారి తీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారిలో తిరిగి పీజీలో చేరింది 12 శాతం లోపేనని, వారిలో నుంచి ఫ్యాకల్టీగా వచ్చింది కేవలం 2 శాతమేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ గతేడాది పార్లమెంట్‌కు సమర్పించిన ఓ నివేదికలో పేర్కొంది. ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారిలో 42 శాతం మంది విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్తుండగా.. మరో 44 శాతం మంది ఉద్యోగాల్లో చేరుతున్నారు. 12 శాతం మంది ఐఐటీల్లో పీజీ కోర్సుల్లో చేరుతుండగా.. మిగిలిన 2 శాతం మంది సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. 

ఐఐటీల కన్నా రెట్టింపు వేతనాలు 
ఐఐటీలతో పోటీ పడే లక్ష్యంతో బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ టెక్నాలజీ (బిట్స్‌), ధీరూభాయి అంబానీ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ (డీఎఐఐసిసి), మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) అంతకంటే రెట్టింపు వేతనాలు ఆఫర్‌ చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌ వంటి ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్‌ చేసి వచ్చిన భారతీయ నిపుణులను తీసుకునేందుకు ఈ మూడు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఐఐటీల్లో పని చేస్తున్న ప్రొఫెసర్లు కొందరు గడచిన నాలుగైదేళ్లుగా రాజీనామాలు చేసి ఈ మూడు సంస్థల్లో చేరారు. కొత్తగా బోధనా రంగంలో చేరాలనుకుని విదేశాల్లో చదువు ముగించుకుని వచ్చిన నిపుణులను ఈ మూడు సంస్థలే పోటీ పడి ఆకర్షిస్తున్నాయి. జార్జియా టెక్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తి చేసుకుని వచ్చిన ఓ ఐఐటీయన్‌కు ఎంఐటీ రూ.1.34 కోట్ల వార్షిక వేతనాన్ని ఆఫర్‌ చేసింది. అమెరికాలో పీహెచ్‌డీ పూర్తి చేసి అక్కడే ఫ్యాకల్టీగా స్థిరపడ్డ భారతీయులను తీసుకువచ్చేందుకు బిట్స్‌ ప్రయత్నిస్తోంది. అప్పటికీ సాధ్యం కాకపోతే విజిటింగ్‌ ప్రొఫెసర్ల కోసం యూఎస్‌ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకుంటోంది. 


కొన్ని ఐఐటీల్లో ఫ్యాకల్టీ ఖాళీలు ఇవీ.. (ఆధారం హెచ్‌ఆర్‌డీ లెక్కలు) 
ఐఐటీ                ఖాళీల శాతం 
గోవా                    62 
దార్వార్డ్‌                47 
ఖరగ్‌పూర్‌             46 
కాన్పూర్‌               37 
ఢిల్లీ                      29 
బాంబే                   27 
బిలాయ్‌                58 
భువనేశ్వర్‌             39 
హైదరాబాద్‌             31  
 

మరిన్ని వార్తలు