ఓజోన్‌ గాయం మానుతోంది

1 Dec, 2018 11:14 IST|Sakshi

తాజా అధ్యయనంలో వెల్లడి

కోల్‌కతా: ఓజోన్‌పొర గాయం మానుతోంది. ఓవైపు వాతావరణ మార్పులతో కలుగుతున్న దుష్ప్రవాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుండగా.. తాజా పరిశోధనలో సంతోషం కలిగించే ఫలితాలు వెల్లడయ్యాయి. దక్షిణ ధ్రువంలో ఓజోన్‌కు పడిన రంధ్రం నెమ్మదిగా పూడుతున్నట్లు శుక్రవారం భారత పరిశోధకులు ప్రకటించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన సెంటర్‌ ఆఫ్‌ ఓషియన్, రివర్స్, అట్మాస్పియర్‌ అండ్‌ లా సైన్స్‌ (కొరల్‌) పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. తొలుత వారు 1979 నుంచి 2017 మధ్య దక్షిణ ధ్రువంలోని ఓజోన్‌కు సంబంధించిన డేటాను తీసుకుని అధ్యయనం చేశారు. ఓజోన్‌ రంధ్రం 2001 నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోందని తేల్చి చెప్పారు. కొన్నేళ్లుగా రిడెక్షన్‌ ఆఫ్‌ ఓజోన్‌ లాస్‌ సాచురేషన్‌ 20 నుంచి 60కి చేరినట్లు వివరించారు.

‘4 దశాబ్దాలుగా ఓజోన్‌లో వచ్చిన మార్పులను అధ్యయనం చేశాం. ఇందుకు అంటార్కిటికాలోని భారత్‌కు చెందిన మైత్రి స్టేషన్‌తో పాటు, వివిధ దేశాలకు చెందిన స్టేషన్‌ల నుంచి డేటా సేకరించి విశ్లేషించగా..1998, 2002ల్లో మినహాయించి, ప్రతి ఏడాది శీతలకాలంలో ఓజోన్‌కు అధికంగా తూట్లు పడుతున్నట్లు తేలింది. కాగా, 2001–17 మధ్య ఓజోన్‌ రంధ్రం కొంతమేరకు పూడుతూ వస్తున్నట్లు స్పష్టంగా తెలిసింది’అని శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జయనారాయణ కుట్టిప్పురత్‌ పేర్కొన్నారు. ఈ ఫలితాలు ఓజోన్‌కు రంధ్రాన్ని చేసే ఉత్పత్తులను నిషేధించే మాంట్రియల్‌ ప్రొటోకాల్‌పై ప్రభావం చూపుతాయా? అని పరిశోధకుడు ప్రొఫెసర్‌ పీసీ పాండేను ప్రశ్నించగా.. ఓజోన్‌ మునుపటిలా సహజస్థితికి రావడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. కాబట్టి ఓజోన్‌ ఒప్పందాలు రద్దు చేయడం క్షేమం కాదని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు