మన దేశంలో 3డీ ఇళ్లు!

6 Nov, 2018 13:40 IST|Sakshi

చెన్నై: మరో ఏడాదిలో దేశంలో 3డీ ప్రింటెడ్‌ ఇళ్లు దర్శనం ఇవ్వనున్నాయి. ఇందుకు సంబంధించి ఐఐటీ మద్రాస్‌కు చెందిన పూర్వ విద్యార్థులు (త్వస్త మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ సొల్యూషన్స్‌ స్టార్టప్‌) కేవలం రెండు రోజుల్లోనే దేశీ టెక్నాలజీతో విజయంతంగా 3డీ ప్రింటెడ్‌ ఇల్లును నిర్మించారు. ఐఐటీఎమ్‌ క్యాంపస్‌లోనే నిర్మించిన ఈ నమునాను ఏడాదిలోగా పెద్ద ఎత్తున మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు త్వస్త సహా వ్యవస్థాపకుడు ఆదిత్య వీఎస్‌ తెలిపారు. దేశంలో మౌలిక సదుపాయల కొరత, తలదాచుకోవడానికి ఇళ్లు కూడా లేనివారే ఈ నిర్మాణాలకు ప్రేరణ అని పేర్కొన్నారు. స్వచ్ఛ్‌భారత్, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అందరికీ ఇళ్లు)పథకాలను 3డీ ప్రింటింగ్‌తో సాకారం చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

ఈ కొత్త టెక్నాలజీ ద్వారా ప్రమాణాలతో కూడిన ఇళ్లను నిర్మించడానికి పలు పరిశ్రమలు, ప్రభుత్వ ఏజెన్సీలతో కలసి పనిచేస్తున్నట్లు ఐఐటీ మద్రాస్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కొషి వర్ఘేస్‌ వెల్లడించారు. ఈ నిర్మాణాలకు ప్రత్యేకంగా రూపొందించిన సిమెంట్‌ను వాడుతున్నామని, మరోవైపు సహజమైన పదార్థాలతో సిమెంట్‌ తయారు చేయడానికి పరిశోధనలు కొనసాగిస్తున్నామని చెప్పారు. నమునా ఇంటి నిర్మాణానికి రెండు రోజులు పట్టినా 320 చదరపు అడుగుల ఇంటిని అన్ని హంగులతో వారం రోజుల్లో పూర్తి చేయగలమని త్వస్త వ్యవస్థాపకులు పరివర్తన్‌రెడ్డి, విద్యాశంకర్, సంతోష్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు