అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ–మద్రాస్‌

9 Apr, 2019 04:14 IST|Sakshi

టాప్‌3లో ఐఐఎస్సీ, ఐఐటీ–ఢిల్లీ

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ను ప్రకటించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: భారత్‌లోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఐఐటీ–మద్రాస్‌ అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇతర సాంకేతిక విద్యాసంస్థల పనితీరు ఆధారంగా రూపొందించిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ జాబితాలో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ) రెండో స్థానంలో నిలవగా, ఐఐటీ–ఢిల్లీ మూడో స్థానం దక్కించుకుంది. ఈ ర్యాంకింగ్‌ ప్రక్రియలో 3,127 విద్యా సంస్థలు పాల్గొన్నాయి. విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సీ–బెంగళూరు తొలిస్థానంలో నిలవగా, జేఎన్‌యూ, బీహెచ్‌యూ ఆతర్వాతి స్థానాల్లో నిలిచాయి. అలాగే కళాశాల విభాగంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని మిరండా కాలేజీ అగ్రస్థానం దక్కిచుకుంది.

మరోవైపు అత్యుత్తమ ఇంజనీరింగ్‌ కళాశాలల జాబితాలోనూ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) విద్యాసంస్థలు సత్తా చాటాయి. టాప్‌–10లో ఏకంగా 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇంజనీరింగ్‌ కళాశాలల జాబితాలో ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–ఢిల్లీ, ఐఐటీ–ముంబై తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల జాబితాలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) తొలి 10 స్థానాల్లో ఆరింటిని దక్కించుకున్నాయి. వీటిలో ఐఐఎం–బెంగళూరు అగ్రస్థానంలో నిలవగా, ఐఐఎం–ఢిల్లీ, ఐఐఎం–ముంబై, ఐఐఎం–రూర్కీ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఉన్నతవిద్య విషయంలో అమ్మాయిల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటంపై రాష్ట్రపతి కోవింద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు