ఐఐటీ విద్యార్థులు క్షేమం

26 Sep, 2018 01:43 IST|Sakshi

హిమాచల్‌లో చిక్కుకున్న తమిళ పర్యాటకులు కూడా...

సిమ్లా/సాక్షి ప్రతినిధి, చెన్నై: హిమాచల్‌ప్రదేశ్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లి అనూహ్యంగా చిక్కుకుపోయిన రూర్కీ ఐఐటీ విద్యార్థులను సైన్యం సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. వీరితోపాటు తమిళనాడుకు చెందిన 33 మంది విద్యార్థులు, 29 మంది ఉపాధ్యాయులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఐఐటీ రూర్కీకి చెందిన 45 మంది ఐఐటీ విద్యార్థులు రొహ్‌తంగ్‌ కనుమల్లో ట్రెక్కింగ్‌ కోసం రెండురోజుల క్రితం వచ్చారు.

మంచు కురుస్తుండటంతో ట్రెక్కింగ్‌కు వెళ్లిన కొండ ప్రాంతంలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న లాహౌల్‌– స్పిటి జిల్లా అధికారులు విద్యార్థులతోపాటు సుమారు 500 మందిని మంగళవారం సురక్షిత ప్రాంతానికి తరలించి, వసతి కల్పించారు. ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన సైన్యం హెలికాప్టర్ల దారా వారిని బయటకు తీసుకువచ్చింది.

తమిళనాడులోని వివిధ ప్రైవేటు పాఠశాలలకు చెందిన 33 మంది విద్యార్థులు, 29 మంది టీచర్లు మనాలిలో సురక్షితంగా ఉన్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. మంచు కురుస్తుండటంతో లాహౌల్‌– స్పిటి జిల్లా కేంద్రం కీలాంగ్‌లో అత్యల్పంగా 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వర్షాలతో అతలాకుతలమవుతున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో పరిస్థితి మంగళవారం కాస్త మెరుగైంది. వరదలతో రూ.1,200 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీఎం జైరాం ఠాకూర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు