నిలకడగా ఉన్న నీటితోనూ విద్యుత్తు!

31 Dec, 2019 05:24 IST|Sakshi
ఐఐటీ గువాహటి పరిశోధకులు జుమి డెకా, కల్యాణ్‌ రైడోంగియా, కుందన్‌ సాహా

వినూత్న పదార్థాలను అభివృద్ధి చేసిన ఐఐటీ గువాహటి

గువాహటి: ఇళ్లల్లో, వీధుల్లో, పల్లెల్లో, పట్టణాల్లోనూ కనిపించే అతి సాధారణ దృశ్యమేది? జల వనరులు! కుండల్లో, కుంటల్లో, చెరువుల్లో ఇలా అన్నిచోట్ల నిలకడగా ఉండే నీరు కనిపిస్తూనే ఉంటుంది. ప్రవహించే నీటితో విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే కొన్ని టెక్నాలజీలు ఉండగా.. నిలకడగా ఉన్న నీటితోనూ కరెంటు పుట్టించే అవకాశమేర్పడింది. ఇందుకు అవసరమైన వినూత్నమైన పదార్థాలను ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు తయారు చేయడం దీనికి కారణం. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. పదార్థాలను ఉపయోగించుకుని ఎక్కడికక్కడ చిన్న స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేసుకోగలగడం.

ఏసీఎస్‌ అప్లైడ్‌ నానో మెటీరియల్స్‌ జర్నల్‌ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. పదార్థాల ధర్మాలు స్థూల ప్రపంచంలో ఒకలా.. సూక్ష్మ ప్రపంచంలో మరోలా ఉంటాయని నానో టెక్నాలజీ గతంలో తేల్చింది. నానోస్థాయిలో వ్యక్తమయ్యే ఇలాంటి ధర్మమే ‘ఎలక్ట్రో కైనెటిక్‌ స్ట్రీమింగ్‌ పొటెన్షియల్‌’. ఈ ధర్మాన్ని వాడి ఇంటి నల్లాల్లో ప్రవహిస్తున్న నీటితో విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునని  అంటున్నారు. ‘కాంట్రాస్టింగ్‌ ఇంటర్‌ఫేషియల్‌ ఆక్టివిటీస్‌’అనే మరో నానోస్థాయి ధర్మం ఆధారంగా సిలికాన్‌ వంటి అర్ధవాహకాలను ఉపయోగించుకుని నిలకడగా ఉన్న నీటితో విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని చెబుతున్నారు.

ముప్పు ముంచుకొస్తోంది..
ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభిృవృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు ఎంచుకున్న పద్ధతి వినూత్నమైనదీ.. ఇప్పటివరకూ ఎవరూ ప్రయత్నించనిది. ‘విద్యుత్తు చార్జ్‌ ఉన్న సూక్ష్మస్థాయి కాలువల్లాంటి నిర్మాణాల ద్వారా ద్రవాలు ప్రవహిస్తున్నప్పుడు వోల్టేజీ ఉత్పత్తి అవుతుంది. అతిసూక్ష్మమైన జనరేటర్లను తయారుచేసి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు’అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కళ్యాణ్‌ రైడోంగియా తెలిపారు.

ఈ విషయం చాలాకాలంగా తెలిసినప్పటికీ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు చాలా తక్కువ కావడంతో ఎవరూ ప్రయత్నించలేదని చెప్పారు. నానోస్థాయిలో పరిశోధనలు చేయడం ద్వారా తాము మునుపటి సమస్యలను అధిగమించగలిగామని, విద్యుదుత్పత్తిని వేలరెట్లు ఎక్కువ చేయవచ్చునని తాము గుర్తించామని కళ్యాణ్‌ వివరించారు. నిలకడగా ఉన్న నీటి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు తాము గ్రాఫీన్‌ పెచ్చులతో పరికరాలను తయారు చేశామని, దీన్ని నీటిలో ముంచడం ఆలస్యం... విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. గ్రాఫీన్‌లో మార్పులు చేసి తాము ఫిల్టర్‌ పేపర్లపై ఏర్పాటు చేశామని, వీటికి నీరు తాకినప్పుడు సుమారు 570 మిల్లీ వోల్టుల విద్యుత్తు ఉత్పత్తి అయిందని వివరించారు.

మరిన్ని వార్తలు