ఐఐటీ, ఐఐఎంలకు  నిధుల కోత 

2 Feb, 2019 04:05 IST|Sakshi

న్యూఢిల్లీ: తాజా బడ్జెట్‌లో ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్‌ఈఆర్‌లతోపాటు నియంత్రణ సంస్థలైన యూజీసీ, ఏఐసీటీఈల కేటాయింపులను 2018–19తో పోలిస్తే కేంద్రం తగ్గించింది. 2019 విద్యాసంవత్సరం నుంచి జనరల్‌ కేటగిరీలోని పేదలకు 10 శాతం కోటా కల్పించి, దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లను పెంచిన నేపథ్యంలో ఆయా సంస్థలకు కేటాయింపులు తగ్గడం గమనార్హం. ఐఐఎంలకు గత ఏడాది రూ.1,036 కోట్లు కేటాయించగా ఈసారి 59.9 శాతం కోతపెడుతూ 415.41 కోట్లు కేటాయించారు. ఐఐటీలకు గత ఏడాది రూ.6,326 కోట్లు ఇవ్వగా ప్రస్తుత బడ్జెట్‌లో రూ.6,223.02 కోట్లు కేటాయించారు. 2017–18లో ఐఐటీలకు రూ.8,337.21 కోట్లు ఇచ్చారు.

యూజీసీకి గత ఏడాది 4,722.75 కోట్లు ఇవ్వగా, ఇప్పుడు దాన్ని రూ.4,600.66 కోట్లకు తగ్గించారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కి గత ఏడాది 485 కోట్లు ఉంటే ఈసారి దాన్ని 466 కోట్లకు తగ్గించారు. మొత్తమ్మీద చట్టబద్ద నియంత్రణ సంస్థలకు గతఏడాదితో పోలిస్తే 2.70 శాతం తక్కువగా ఉంది. ప్రస్తుత బడ్జెట్‌లో ఈ సంస్థలకు రూ.5,066.66 కోట్లు ప్రతిపాదించగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,207.75 కోట్లు కేటాయించారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, ఎడ్యుకేషన్, రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)లకు ఈ బడ్జెట్‌లో రూ.660 కోట్లు ప్రతిపాదించారు. ఇది గత ఏడాది రూ.689 కోట్లుగా ఉంది.   

మరిన్ని వార్తలు