ఇకపై దేశీయ విద్యార్థుల కోసం ఉచిత ఆన్‌లైన్ కోర్సులు

20 Jul, 2013 06:20 IST|Sakshi
ఇకపై దేశీయ విద్యార్థుల కోసం ఉచిత ఆన్‌లైన్ కోర్సులు

ముంబై: లక్షలు ఖర్చు చేసి కోరుకున్న కోర్సులు చదివినా సరైన నైపుణ్యంలేక ఉద్యోగం రాలేదనో లేక చేస్తున్న ఉద్యోగంలో ఎదుగుదలకు ఆస్కారం లభించడంలేదనో బాధపడుతున్నారా? ఇకపై మీకు ఈ ఆందోళన అక్కర్లేదు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండానే కోరుకున్న కోర్సును మీరు పూర్తి చేసేయొచ్చు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీల్లోని అధ్యాపకులు చెప్పే పాఠాలను ఎంచక్కా నేర్చుకొని దర్జాగా కొలువు సంపాదించవచ్చు.

ఒకవేళ ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారైతే గ్యారంటీగా ప్రమోషన్ పొందచ్చు. ఇవన్నీ ఎలా సాధ్యం అంటారా? వృత్తివిద్యా కోర్సుల్లో ప్రతిభ చూపుతున్నా పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యం కనబరచడంలో విఫలమవుతున్న దేశీయ విద్యార్థులకు ఉచిత ఆన్‌లైన్ కోర్సులను అందించేందుకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలతోపాటు ప్రముఖ ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ ముందుకు వచ్చాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్)తో కలిసి విస్తృత స్థాయిలో ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులను (ఎంవోవోసీ) ప్రవేశపెట్టనున్నాయి.

ఈ ఏడాది అక్టోబర్ నుంచి తొలుత కంప్యూటర్ సైన్స్‌లో మూడు కోర్సులను అందించనున్నాయి. తద్వారా దేశంలో ఏటా సుమారు లక్ష నుంచి లక్షన్నర మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు ఉద్యోగకల్పన దిశగా వారిని ముందుకు నడిపించనున్నాయి. ఐఐటీ-ఢిల్లీ, మద్రాస్, ఖరగ్‌పూర్, కాన్పూర్, రూర్కీ, బాంబే, గువాహటిలకు చెందిన 15 మంది ప్రొఫెసర్లు ప్రస్తుతం ఈ కొర్సు రూపకల్పనలో నిమగ్నమయ్యారు.

ఏమిటీ ఎంవోవోసీ?
ప్రఖ్యాత యూనివర్సిటీల సాయంతో నాణ్యమైన విద్యను ప్రపంచంలో ఎవరికైనా, ఎక్కడినుంచైనా ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చే వ్యవస్థే ఎంవోవోసీ. అమెరికాలో గత ఏడాది కోర్సెరా అనే సంస్థ ఈ తరహా కోర్సులను ప్రారంభించగా ఉడాసిటీ, ఈడీఎక్స్ అనే సంస్థలు కూడా ఇదే తరహాలో కోర్సులు అందిస్తున్నాయి. బ్రిటన్‌లో ఫ్యూచర్‌లర్న్ పేరుతో మరో సంస్థ సెప్టెంబర్ నుంచి కోర్సులను అందించనుంది. స్టాన్‌ఫోర్డ్, హార్వర్డ్, మసాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) మొదలైనవి ఇందులో పాలుపంచు కుంటున్నాయి.

>
మరిన్ని వార్తలు