దోచుకున్న వారికి దోచుకున్నంత..!

6 Nov, 2014 02:30 IST|Sakshi
దోచుకున్న వారికి దోచుకున్నంత..!

- ఇసుక మాఫియాకు కాసుల వర్షం
- బళ్లారిలో భారీగా ఇసుక అక్రమ తవ్వకాలు
- అనుమతులు రద్దయినా యథేచ్ఛగా తరలింపు
- ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి
- మాఫియాకు అధికార పార్టీ నేతల అండదండలు
- చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న జిల్లా యంత్రాంగం

సాక్షి, బళ్లారి : తాలూకాలో ఇసుక అక్రమ తవ్వకాలు భారీగా సాగుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. బళ్లారి తాలూకా పరిధిలోని మోకా, రూపనగుడి, హగరి తదితర నది పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో భారీగా ఇసుక నిల్వలు ఉన్నాయి. ఈ ప్రాంతాల పరిధిలో మూడు కంపెనీలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఏడాదికి ఒకసారి ఇసుక కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేయడమో లేక కొత్త వారికి అనుమతులు ఇవ్వడమో చేసి ఇసుక తవ్వకాలు చేపట్టాలనే నిబంధనలు ఉన్నాయి.

నెల రోజుల క్రితం బళ్లారి తాలూకాలో ఉన్న ఇసుక కాంట్రాక్టర్ల టెండర్ల గడువు ముగిసింది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్యూబిక్ మీటర్ ఇసుక తవ్వకాలకు రూ.670లు చెల్లించి ఇసుక తవ్వకాలు చేపట్టాలి. క్యూబిక్ మీటర్‌కు రూ.670లు ప్రకారం నెలకు మూడు వేల క్యూబిక్ మీటర్ల వరకు తవ్వుకోవచ్చు. తద్వారా ప్రభుత్వానికి నెలకు దాదాపు రూ.21 లక్షలు ఆదాయం వచ్చేది. ప్రస్తుతం టెండర్ల గడువు ముగిసినప్పటికీ ఇసుక తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. పాత కాంట్రాక్టర్లు గడువు ముగిసినప్పటికీ ఇసుక తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ, ఇసుక తవ్వకాలను యథేచ్ఛగా అధికార పార్టీ నేతలు కొనసాగిస్తున్నారు.

ఇసుక తవ్వకాలు రద్దు చేశారని అధికారికంగా పేర్కొంటూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రభుత్వ భనన నిర్మాణాలకు ఇసుక కొరత సృష్టిస్తూ, బళ్లారిలో అక్రమంగా ఇసుక అమ్మకాలు సాగిస్తున్నారు. బళ్లారితో పాటు బెంగళూరుకు కూడా ఇక్కడ నుంచి ఇసుకను భారీగా తరలిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అండదండలతో ఇసుక తవ్వకం దారులు పెట్రేగిపోతున్నారు. భారీగా ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల హగరి నది పరివాహక ప్రాంతాలైన చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలకు భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి.

దీనిపై రైతులు ఆందోళనలు చేపట్టినా జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. అటవీశాఖ అధికారులు, జిల్లా యంత్రాంగంలోని ప్రముఖ అధికారులకు, పోలీసులకు మామూళ్లు సమర్పిస్తూ ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు ఆరోపణలున్నాయి.  ప్రతి జిల్లా పంచాయతీ సమావేశంలోను ఈ అక్రమాలపై సంబంధిత ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, జెడ్పీ మెంబర్లు నిలదీసినా ప్రయోజనం శూన్యం. ఈ సమస్య పరిష్కారంపై  జిల్లా ఇన్ చార్జి మంత్రి పరమేశ్వర నాయక్  చొరవ చూపకపోవడం శోచనీయం.

మరిన్ని వార్తలు