నేను హిందూ జాతీయవాదిని : నరేంద్ర మోడీ

13 Jul, 2013 05:02 IST|Sakshi
నేను హిందూ జాతీయవాదిని : నరేంద్ర మోడీ

- రాయ్‌టర్స్ ఇంటర్వ్యూలో మోడీ ఉద్ఘాటన
- ముస్లింలను, హిందువులను వేర్వేరుగా చూడను..
- అందర్నీ భారతీయులుగానే చూస్తాను
- 2002లో నేను చేసింది ముమ్మాటికీ కరెక్టే..
- సుప్రీంకోర్టు నియమించిన సిట్ కూడా అదే చెప్పింది
- నేను తప్పు చేశానని ఎన్నడూ అనుకోలేదు
- కుక్క పిల్ల కారు కింద పడితే ఎవరికైనా బాధే

అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తనను తాను హిందూ జాతీయవాదిగా అభివర్ణించుకున్నారు. తాను హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను వేర్వేరుగా చూడనని, అందర్నీ భారతీయులుగానే భావిస్తానని చెప్పారు. అదే సమయంలో గుజరాత్‌లో 2002 సంవత్సరంలో అల్లర్లు చెలరేగినప్పుడు తాను తీసుకున్న నిర్ణయాలు ముమ్మాటికీ కరెక్టేనని ఆయన ఉద్ఘాటించారు. శుక్రవారం రాయ్‌టర్స్ వార్తా సంస్థకు గాంధీనగర్‌లోని తన అధికార నివాసంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా మంది మీ విషయంలో 2002 సంఘటనలనే ప్రస్తావిస్తుంటారు.. అది మీకు అసహనం తెప్పిస్తుంటుందా అని ప్రశ్నించగా.. ‘‘నేను తప్పు చేసుంటే బాధపడేవాడిని.

‘అరే నేను దొరికిపోయాను.. నేను దొంగతనం చేస్తూ దొరికిపోయాను’ అని మీకు అనిపించినప్పడు నిజంగానే అసహనం వస్తుంటుంది. కానీ నా విషయం అలాంటిది కాదు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చింది’’ అని గుర్తుచేశారు. ‘‘ఇంకో విషయమేంటంటే.. మనం కారు నడుపుతున్నామనుకోండి.. మనమే డ్రైవర్. పోనీ.. వేరెవరైనా నడుపుతున్నపుడు వెనుక కూర్చున్నామని అనుకుందాం. ఆ సమయంలో ఏదైనా కుక్కపిల్ల కారు కింద పడితే.. అది బాధగా ఉంటుందా? ఉండదా? నిజం.. బాధగానే ఉంటుంది. నేను ముఖ్యమంత్రిని అయినా కాకపోయినా నేనూ మనిషినే. చెడు సంఘటన ఎక్కడ జరిగినా బాధనిపిస్తుంది’’ అని మోడీ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

అందరికీ న్యాయమే నా తత్వం..
‘‘నేను జాతీయవాదిని. దేశభక్తుడిని. ఇందులో తప్పేం లేదు. నేను పుట్టకతోనే హిందువుని. ఇందులోనూ తప్పు లేదు. కాబట్టి నేను హిందూ జాతీయవాదిని’’ అని మోడీ ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు. హిందూ జాతీయవాది, వాణిజ్య అనుకూల ముఖ్యమంత్రి.. వీరిలో ఎవరు నిజమైన మోడీ అని ప్రశ్నించగా.. ‘‘అభివృద్ధి, పురోగతి, పని రాక్షసుడు.. ఎవరు ఏం మాట్లాడినా వారు ఇదే చెప్తుంటారు. కాబట్టి రెండింటిలో పెద్ద తేడా ఏమీ లేదు. రెండూ ఒకటే’’ అని వ్యాఖ్యానించారు. భారత్‌కు లౌకికవాద నాయకుడు ఉండాలని విశ్వసిస్తారా అని అడగ్గా.. ‘‘మేం కచ్చితంగా దాన్ని విశ్వసిస్తాం. అయితే లౌకికవాదం అంటే అర్థం ఏమిటి? నా వరకు అయితే ముందు భారత్.. తర్వాతే ఏదైనా.. ఇదే నా లౌకికవాదం. అందరికీ న్యాయం చేయడం, ఎవరినీ బుజ్జగించకపోవడమే నా పార్టీ తత్వం’’ అని చెప్పారు.

ముస్లింలైనా, హిందువులైనా అందరూ భారతీయులే
మైనారిటీ ఓటర్లను ఎలా ఆకట్టుకుంటారని ప్రశ్నించగా మోడీ స్పందిస్తూ.. ఓటర్లందరినీ భారతీయులుగానే చూస్తానన్నారు. ‘‘హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా.. అందరూ భారత దేశ పౌరులే. అందువల్ల వారిని వేర్వేరుగా భావించను. అలా చూస్తే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ప్రజాస్వామ్య ప్రక్రియలో మతం ఓ పనిముట్టు కాకూడదు’’ అని వ్యాఖ్యానించారు.

‘కుక్కపిల్ల’ కామెంట్‌పై మండిపడిన పార్టీలు
గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ, సీపీఎం, సీపీఐ, జేడీయూ సహా పలు పార్టీలు మండిపడ్డాయి. ముస్లింలను మోడీ కుక్కపిల్లలతో పోల్చారంటూ ఆగ్రహం వ్యక్తంచేశాయి. ముస్లింలను అవమానించినందుకు ఆయన క్షమాపణ చెప్పి తీరాలని సమాజ్‌వాదీ పార్టీ నేత కమల్ ఫరూకీ డిమాండ్ చేశారు. మోడీ వక్రబుద్ధికి ఆయన వ్యాఖ్యలు నిదర్శనమని, భారతీయ సిద్ధాంతానికి అవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విమర్శించారు. 2002 అల్లర్లలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, దాన్ని మోడీ అభివర్ణించిన తీరును అందరూ ఖండించాల్సిందేనని అన్నారు. కాంగ్రెస్ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. మోడీ రోజు రోజుకూ తనకు తానే శత్రువుగా మారుతున్నారని అన్నారు. సీపీఎం నేత బృందా కారత్ మాట్లాడుతూ.. ఆయన చెబుతున్న దాంట్లో మౌలికంగానే చాలా తప్పు ఉందని అన్నారు. సీపీఐ నేత డి.రాజా మాట్లాడుతూ.. దేశ ప్రజలను మోసం చేసేలా మోడీ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాగా, ఒక వర్గాన్ని బుజ్జగించడం కోసం కొందరు మోడీ వ్యాఖ్యలకు విపరీత అర్థాలు తీస్తున్నారని బీజేపీ విమర్శించింది.

భారతీయ సంస్కృతిలో ప్రాణులన్నిటికీ విలువ ఉంది
‘కుక్కపిల్ల’ వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘‘భారతీయ సంస్కృతీ, సంప్రదాయాల్లో అన్ని రకాల ప్రాణులకూ విలువనిస్తాం.. పూజిస్తాం’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

హిందుత్వ నేత వద్దే దేశ పగ్గాలుండాలి: శివసేన
దేశ నాయకత్వ పగ్గాలు హిందుత్వ నాయకుడి చేతిలోనే ఉండాలని తాము విశ్వసిస్తామని శివసేన తెలిపింది. తాను హిందుత్వ జాతీయవాదినంటూ మోడీ చేసిన వ్యాఖ్యలను గట్టిగా సమర్థించింది. ‘‘హిందుత్వవాదులు ఏ మతానికీ వ్యతిరేకం కాదు’’ అని శివసేన పేర్కొంది.
 

>
మరిన్ని వార్తలు