బాట్లా హౌస్ కేసులో దోషిగా షెహ్‌జాద్

26 Jul, 2013 04:52 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో పోలీసు అధికారిని హత్య చేశారనే అభియోగాలపై ఇండియన్ ముజాహిద్ ఉగ్రవాది షెహ్‌జాద్ అహ్మద్‌ను గురువారం ఢిల్లీ కోర్టు దోషిగా నిర్ధారించింది. సోమవారం అతడికి శిక్ష ఖరారు చేయనుంది. ‘‘పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎం.సి.శర్మపై కాల్పులు జరపడం ద్వారా ఆయన మరణానికి షెహ్‌జాద్ కారణమైనట్టు తేలింది. హెడ్ కానిస్టేబుళ్లు బల్వంత్ సింగ్, రాజ్‌బీర్ సింగ్‌లపై హత్యాయత్నం చేసినట్టు వెల్లడైంది. అందువల్ల షెహ్‌నాజ్‌ను ఈ కేసులో దోషిగా నిర్ధారిస్తున్నాం’’ అని అదనపు సెషన్స్ జడ్జి రాజేంద్ర కుమార్ శాస్త్రి పేర్కొన్నారు. కాగా, తీర్పుపై తాము హైకోర్టుకు వెళ్తామని షెహ్‌జాద్ న్యాయవాది తెలిపారు. ఢిల్లీలోని మూడు చోట్ల బాంబు పేలుళ్లు జరిగిన 6 రోజుల తర్వాత 2008 సెప్టెంబర్ 19న జామియానగర్‌లోని బాట్లాహౌస్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. పేలుళ్లలో ప్రమేయం ఉన్న ఉగ్రవాదులు అక్కడున్న సమాచారం మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆ భవనాన్ని చుట్టుముట్టారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో అతిఫ్ అమీన్, మహ్మద్ సాజిద్‌లుమృతిచెందారు. షెహ్‌నాజ్ జరిపిన కాల్పుల్లో పోలీసు అధికారి ఎం.సి.శర్మ ప్రాణాలు కోల్పోగా, బల్వంత్‌సింగ్,రాజ్‌బీర్‌సింగ్‌లు గాయపడ్డారు. అనంతరం షెహ్‌జాద్‌తోపాటు, జునాయిద్ అక్కడి నుంచి పారిపోయారు. మరో ఉగ్రవాది మహ్మద్ సైఫ్ పోలీసులకు లొంగిపోయాడు.

దిగ్విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

బాట్లా హౌస్ కేసులో కోర్టు తీర్పు వెలువడిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అది నకిలీ ఎన్‌కౌంటర్ అని, దానిపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం దిగ్విజయ్ డిమాండ్‌ను తోసిపుచ్చింది.
 

మరిన్ని వార్తలు