17న దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మె

14 Jun, 2019 17:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోల్‌కతాలో వైద్యులపై దాడికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలకు ఐఎంఏ సంఘీభావంగా ఈనెల 17న దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్టు ప్రకటించింది. మరోవైపు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్త నిరసనలను ప్రారంభించింది. ఈనెల 17న ఔట్‌పేషెంట్‌ విభాగాలతో పాటు  అత్యవసర మినహా అన్ని వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ఐఎంఏ ప్రకటించింది. అయితే ఎమర్జెన్సీ, ​క్యాజువాలిటీ సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

ఇక ఆస్పత్రుల్లో వైద్యులకు భద్రత కల్పించాలని ఐఎంఏ డిమాండ్‌ చేసింది. మరోవైపు బెంగాల్‌లో జూనియర్‌ డాక్టర్ల ఆందోళనను విరమింపచేసేందుకు చొరవ చూపాలని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాన్ని కోల్‌కతా హైకోర్టు కోరింది. వైద్యుల ఆందోళనతో నెలకొన్న ప్రతిష్టంభనేను తొలగించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారో వారం రోజుల్లోగా వెల్లడించాలని బెంగాల్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి బంధువులు జరిపిన దాడిలో ఇద్దరు వైద్యులు తీవ్రంగా గాయపడిన ఘటనకు నిరసనగా పశ్చిమ బెంగాల్‌లో వైద్యులు గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు