స్విమ్మింగ్‌ పూల్‌ కింద 300 కిలోల గోల్డ్‌!

8 Aug, 2019 07:59 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ఓ స్విమ్మింగ్‌ పూల్‌ కింద దాచి ఉంచిన 300 కేజీల నకిలీ బంగారు కడ్డీలను ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు బుధవారం బెంగళూరులో స్వాధీనం చేసుకున్నారు. వేల కోట్ల విలువైన ఐఎంఏ గ్రూప్‌ పోంజీ స్కామ్‌ కేసును సిట్‌ దర్యాప్తు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఐఎంఏ గ్రూప్‌ అధిపతి మొహమ్మద్‌ మన్సూర్‌ ఖాన్‌కు చెందిన బెంగళూరులోని ఓ భవంతి ఆరో అంతస్తులో డీసీపీ గిరీశ్‌ ఆధ్వర్యంలో సిట్‌ సోదాలు నిర్వహించింది. అక్కడ గల స్విమ్మింగ్‌పూల్‌ కింద గతంలో మన్సూర్‌ దాచిన 5,880 నకిలీ బంగారం కడ్డీలను సిట్‌ స్వాధీనం చేసుకుంది. తన గ్రూప్‌లో భారీగా పెట్టుబడులు పెట్టండంటూ ఈ నకిలీ బంగారం కడ్డీలు చూపించి ఇన్వెస్టర్లను మన్సూర్‌ మోసం చేసేవాడని సిట్‌ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. 

కాగా అధికారులు, నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులలో కొందరికి దాదాపు రూ. 400 కోట్ల వరకూ లంచాలు ఇచ్చానని.. ఫలితంగా తాను మోసపోయానని..ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ మన్సూర్‌ ఖాన్‌ ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేసి.. అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఐ మానిజటరీ అడ్వైజరీకి చెందిన దాదాపు రూ. 209 కోట్ల ఆస్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స్వాధీనం చేసుకొంది. సుమారు 40 వేల మంది డిపాజిట్‌దారులకు వంచించిన మన్సూర్‌ ఖాన్‌కు చెందిన ఆస్తిని స్వాధీనం చేసుకున్నామని, ఇందులో రూ.197 కోట్ల స్థిరాస్తి, రూ.12 కోట్లు నగదు ఉన్నట్లు పత్రికా ప్రకటనలో ఈడీ అధికారులు తెలిపారు. 

ఈ క్రమంలో మన్సూర్‌ ఖాన్‌కు వ్యవతిరేకంగా బ్లూకార్నర్‌ నోటీస్‌ జారీచేశారు. ఇటీవల మన్సూర్‌ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని సీఐడీ ఇంటర్‌ పోల్‌కు ప్రతిపాదన సమర్పించింది. వేలాదికోట్ల వంచన కేసును తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర గత ప్రభుత్వం ఎలాగైనా డబ్బు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని భరోసానిచ్చింది. అంతేకాకుండా కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించింది. ఇదే సందర్భంలో ఐఎంఏ కంపెనీ బ్యాంకు ఖాతాల్లో విదేశీ లావాదేవీలు కూడా జరిగిందన్న అంశాన్ని కనుగొన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మన్సూర్‌ భారత్‌కు వచ్చేస్తానంటూ మరో వీడియో విడుదల చేశాడు. ఇందులో భాగంగా దుబాయ్‌ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆయనను ఎయిర్‌పోర్టులోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసినట్లు ఇటీవల సిట్‌ పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఖాన్‌ను ఢిల్లీలోనే ఈడీ విచారిస్తోంది. దుబాయ్‌లో తలదాచుకున్న మన్సూర్‌ భారత్‌కి వచ్చి, కోర్టులో లొంగిపోవడానికి దర్యాప్తు సంస్థలు ఒప్పించినట్లు సిట్‌ అధికారులు తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా