రైతన్నకు తీపి కబురు

17 Apr, 2018 01:29 IST|Sakshi
ఈ ఏడాది వర్షపాతం తీరు అంచనా.., ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ రమేశ్‌

ఈ ఏడాది సాధారణ వర్షపాతం: ఐఎండీ

వానలు పడే రోజులు తగ్గుతున్నాయి

రుతుపవనాలపై తొలివిడత అంచనా

సాక్షి, న్యూఢిల్లీ: దేశానికి వెన్నెముకైన రైతన్నలకు సంతోషాన్నిచ్చే కబురును భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం చెప్పింది. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ వర్షపాతాన్ని తెస్తాయని వెల్లడించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ కేజే రమేశ్‌ వాతావరణ విభాగం తొలివిడత అంచనాలను విడుదల చేశారు. రెండో అంచనాలను జూన్‌ ప్రారంభంలో, రుతుపవనాల ప్రారంభాన్ని మే మాసంలో వెల్లడిస్తారు.

సాధారణంగా జూన్‌ 1కి నాలుగు రోజులు అటుఇటుగా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. రమేశ్‌ మాట్లాడుతూ ‘2018 నైరుతి రుతుపవనాల కాలంలో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య వర్షపాతం సాధారణంగా ఉంటుంది. 2016, 2017 సీజన్లలాగే విస్తృతంగా వర్షాలు పడి రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. దీర్ఘకాలిక సగటు వర్షపాతంతో పోలిస్తే ఈ ఏడాది 97 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ అంచనా వాస్తవంలో ఐదు శాతం తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. 1951 నుంచి 2000 వరకు చూస్తే దీర్ఘకాలిక సగటు వర్షపాతం 890 మి.మీ.’ అని చెప్పారు.  

వాన రోజులు తగ్గుతున్నాయి జాగ్రత్త!
గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా గత కొన్నేళ్లుగా వర్షాలు పడే రోజులు తగ్గుతున్నాయనీ, నీటి సంరక్షణ, నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని రమేశ్‌ సూచించారు.  ‘ఒక ఏడాదిలో వర్షం కురిసే రోజుల సంఖ్య గతంలో కంటే తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో వాననీటిని ఒడిసిపట్టుకునేందుకు నీటి సంరక్షణ పద్ధతులను మెరుగ్గా పాటించాలి.

నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాల సగటులో 96% వర్షం కురుస్తుందని గతేడాది మేం అంచనా వేసినా మధ్య భారతంలో కొన్ని రోజులు వర్షాలు పడలేదు. సెప్టెంబరు ఆఖరు వరకు చూస్తే 95% వర్షపాతమే నమోదైంది. అయితే అక్టోబరు మొదటి వారంలో మరికొంత వర్షం పడటంతో మా అంచనాలు నిజమయ్యాయి. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఒక శాతం ఎక్కువగానే మా అంచనాలు ఉన్నాయి’ అని రమేశ్‌ వివరించారు.

పరిస్థితులు అనుకూలం: గత ఏడాది ఓ మోస్తరుగా ఉన్న లా నినా పరిస్థితులు ఈ ఏడాది ప్రారంభంలో బలహీనపడ్డాయనీ, రుతుపవనాల సీజన్‌ ప్రారంభమయ్యే నాటికి తటస్థ పరిస్థితికి వచ్చే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు. ‘ఈ ఏడాది రుతుపవనాలు ప్రారంభమయ్యేనాటికి లా నినా తటస్థంగా ఉండే అవకాశం ఉంది. ఎల్‌నినో పరిస్థితులకు అవకాశం లేదు’ అని చెప్పారు.

ఈ అంచనాలు నిజమైతే దేశ ఆర్థిక వ్యవస్థకూ మేలు జరుగుతుందనీ, జీడీపీ వృద్ధిరేటు కూడా పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 27.75 కోట్ల టన్నుల ధాన్యాల దిగుబడి జరగ్గా.. వర్షాలు బాగా కురిస్తే వచ్చే ఏడాది ఉత్పత్తి అంతకు దాటి పోవచ్చని వ్యవసాయ శాఖ కార్యదర్శి పట్నాయక్‌ చెప్పారు. 50 శాతానికిపైగా రైతులు వర్షాధారిత సాగు చేస్తుండటంతో వారి దిగుబడి పెరిగి తద్వారా కొనుగోలు శక్తి కూడా పెరిగి ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని అంటున్నారు.

మరిన్ని వార్తలు