ఐదు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్

25 May, 2020 12:36 IST|Sakshi

న్యూఢిల్లీ: గడిచిన వారం రోజులుగా ఒక్కసారిగా దేశంలో ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైన నమోదవుతుండగా.. రాబోయే రోజుల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఉత్తర భారతదేశంలోని హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌, చంఢీఘర్‌, ఢిల్లీ రాష్ట్రాలకు ఆదివారం 'రెడ్‌ అలర్ట్‌' ఉత్తర్వులను జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో కూడా వడగాలు వీస్తాయని ఐఎండీ 'ఆరెంజ్‌ వార్నింగ్'‌ జారీ చేసింది. చదవండి: గాడ్సే దేశాన్ని రక్షించారంటూ ఎఫ్‌బీలో పోస్ట్‌ 

ఈ విషయంపై ఐఎండీ రీజినల్ మెటీరియాలజీ సెంటర్ హెడ్ కుల్దీప్ శ్రీవాస్తవ వివరణ ఇస్తూ.. రాబోయే రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటి నమోదవుతాయి. ఈ సంవత్సరం వేసవిలో అధిక సంఖ్యలో ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. ఉత్తర, మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఇప్పటి వరకూ సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. ఏప్రిల్, మే మధ్య వరకు వర్షాలు కురవడంతో ఎండలు తీవ్రత అంతగాలేదని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకూ కొనసాగుతాయనీ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా ఢిల్లీ, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు.

పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండనున్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీలుగా నమోదైంది. దీనికి తోడు వేడిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెడ్ వార్నింగ్ జారీచేసిన ప్రాంతాల్లోని ప్రజలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని ఐఎండీ సూచించింది. 

చదవండి: కరోనా : టాటా గ్రూపు సీఈవోల కీలక నిర్ణయం 

మరిన్ని వార్తలు