16 నాటికి అండమాన్‌కు రుతుపవనాలు 

14 May, 2020 07:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల సాధారణం కన్నా సుమారు ఆరు రోజుల ముందే, మే 16 నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్, నికోబార్‌ దీవులను చేరుకుంటాయని బుధవారం భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా రుతుపవనాలు అండమాన్, నికోబార్‌ దీవులను మే 20వ తేదీ వరకు చేరుకుంటాయి. ఆ తరువాత కేరళ చేరుకునేందుకు వాటికి 10, 11 రోజులు పడుతుంది. అప్పుడే వర్షాకాలం ప్రారంభమైనట్లు భావిస్తారు. కేరళకు రుతుపవనాలు చేరుకునే కచ్చితమైన సమయాన్ని వారం రోజుల్లో వాతావరణ శాఖ ప్రకటించే అవకాశముంది. (తెల్లరంగు దుస్తులు ధరించండి)

మే 15 నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై, ఆ మర్నాడు సాయంత్రానికి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలో ప్రవేశించనున్నాయంది. ఈ సంవత్సరం నుంచి రుతుపవనాల ప్రారంభం, ముగింపునకు సంబంధించిన వివరాలను 1960–2019 డేటా ఆధారంగా ప్రకటించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 1901–1940 మధ్య డేటా ఆధారంగా ఆ వివరాలను ప్రకటించేవారు.   

మరిన్ని వార్తలు