అలర్ట్‌ : దక్షిణాదికి భారీ వర్ష సూచన

7 Oct, 2018 19:33 IST|Sakshi

సాక్షి, చెన్నై : దక్షిణ కర్నాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరించింది. ఈ ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రంలో అలలు ఉధృతంగా ఎగిసిపడతాయని ఐఎండీ పేర్కొంది. మత్స్యకారులు చేపల వేటకు దూరంగా ఉండాలని సూచించింది. చేపలవేటకు సముద్రంలోకి వెళ్లిన వారు తిరిగి వారి ఇళ్లకు చేరుకోవాలని హెచ్చరించింది.

రాగల 36 గంటల్లో బంగాళాఖాతంలో కేంద్రకృతమైన వాయుగుండం తుఫాన్‌గా మారుతుందని ప్రాంతీయ వాతావరణం కేంద్రం సైతం అధికారులను అప్రమత్తం చేసింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరిలోని కన్యాకుమారి, తిరునల్వేలి, దిండిగల్‌, తేని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెలల్డించింది.

చెన్నై పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. తుపాన్‌ హెచ్చరికలతో తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. విపత్తు నిర్వహణ, కోస్ట్‌గార్డ్స్‌ బృందాలను సిద్ధం చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేపట్టాయి.

మరిన్ని వార్తలు