మోదీకి ఐఎంఎఫ్‌ కితాబు

9 Oct, 2018 11:07 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి : మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదన్న ఒపీనియన్‌ పోల్స్‌తో కుదేలైన పార్టీ శ్రేణులకు అంతర్జాతీయ ద్రవ్య నిధి  (ఐఎంఎఫ్‌)  కొంత ఊరట కల్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృ‍త్వంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలను ఐఎంఎఫ్‌ గుర్తిస్తూ ఈ ఏడాది, వచ్చే ఏడాది సైతం భారత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతుందని వ్యాఖ్యానించింది.

ఇండోనేషియాలోని బాలిలో జరగనున్న ఐఎంఎఫ్‌ వార్షిక భేటీకి ముందు విడుదల చేసిన వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ (డబ్ల్యూఈఓ) నివేదికలో మోదీ సర్కార్‌పై ప్రశంసలు గుప్పించింది. ఇటీవల భారత్‌లో జీఎస్టీ, దివాలా చట్టం, విదేశీ పెట్టుబడుల సరళీకరణకు చర్యలు వంటి కీలక సంస్కరణలు చేపట్టడంతో భారత్‌లో వ్యాపారం సులభతరమైందని వ్యాఖ్యానించింది.

పెరుగుతున్న ముడిచమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక మందగమనంతో వచ్చే ఏడాది భారత ఆర్థిక వృద్ధి రేటును 0.1 శాతం మేర తగ్గించి 7.4 శాతంగా ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఈ స్ధాయి వృద్ధి రేటు సైతం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7.3 శాతంగా ఐఎంఎఫ్‌ పేర్కొంది. నోట్ల రద్దు, జీఎస్టీ నుంచి భారత్‌ ఆర్థిక వ్యవస్థ కోలుకుని భారీ వృద్ధిరేట్ల దిశగా అడుగులు వేస్తోందని డబ్ల్యూఈఓ నివేదిక పేర్కొంది. 2019 తర్వాత భారత్‌ 7.75 శాతం వృద్ధి రేటును నిలకడగా సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక ఈ ఏడాది చైనా వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

మరిన్ని వార్తలు