పూరి సమీపంలో తీరాన్ని దాటిన ఫొని

3 May, 2019 11:23 IST|Sakshi

సాక్షి, భువనేశ్వర్‌ : దక్షిణ అగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి వాయగుండంగా రూపాంతరం దాల్చి వాయువేగంతో ఒడిశా తీరం వైపు దూసుకువచ్చిన ఫొని తుపాను శుక్రవారం ఉదయం పూరి సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో పూరి తీర ప్రాంతంలో గంటల 180-200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు పూరి తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. ఆర్టీజీఎస్‌ అంచనాలకు అనుగుణంగానే ఫొని తుపాను ఈ రోజు ఉదయం 10.30 నుంచి 11.30 గంటల మధ‍్యలో తీరాన్ని దాటింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 900 శిబిరాలు ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు మూసివేసి, పునరావాస కేంద్రాలుగా మార్చారు.  

మరోవైపు ఒడిశాలో ముందుజాగ్రత్త చర్యగా రైలు, విమాన సర్వీసులను నిలిపివేశారు. కోల్‌కతా-చెన్నై మార్గంలో ప్రయాణించే 220కి పైగా రైళ్లు రేపటివరకూ రద్దు అయ్యాయి. భువనేశ్వర్‌, కోల్‌కతా విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తీరప్రాంత విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. అలాగే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు రైల్వేశాఖ మూడు ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ప్రధాన స్టేషన్లలోని స్టాల్స్‌లో ఆహార పదార్థాలు, మంచినీటిని సిద్ధంగా ఉంచినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అంతేకాకుండా మరో మూడు రోజుల వరకూ సెలవులు పెట్టొద్దని ఉద్యోగులకు రైల్వేశాఖ సూచించింది. అలాగే తుపాను ప్రభావం తెలుసుకునేందుకు వాయుసేన విమానాలను సిద్ధంగా ఉంచింది. వివిధ ప్రాంతాల్లో 34 సహాయక బృందాలను తీరప్రాంత రక్షణదళం ఉంచింది. 

ఒడిశాలో గత 24 గంటల్లో సగటు వర్షపాతం 16.07 మి.మీగా నమోదు అయింది. జిల్లాల వారిగా నమోదు అయిన వర్షపాతం వివరాలు:
రాయ్‌గఢ్‌: 9.5 మి.మీ
కోల్నార : 5.2 మి.మీ
కెసింగ్‌పుర్‌: 1.8 మి.మీ
గుణ్‌పుర్‌: 24 మి.మీ
పద్మాపుర్‌    : 18.7 మి.మీ
గుడారి : 28.6 మి.మీ
రామన్‌గుడ : 14.4 మి.మీ
కటక్‌ : 3.2 మి.మీ
మునిగడ : 47 మి.మీ
చంద్రాపుర్‌ : 22 మి.మీ 

ఒడిశా నుంచి కోల్‌కతా వైపు ఫొని తుపాను పయనిస్తుండటంతో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అప్రమత్తం అయింది. అవసరం అయితే రెండురోజుల పాటు ఖరగ్‌పూర్‌లోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తామని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఫొని తుపాను రేపు అర్థరాత్రి లేదా ఆదివారం ఉదయానికి ఢాకా సమీపంలో పూర్తిగా బలహీనపడనుంది.

మరిన్ని వార్తలు