ఒకే దేశం–ఒకే రేషన్‌ కార్డు

30 Jun, 2019 04:20 IST|Sakshi

వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు గడువు ఇచ్చిన కేంద్రం

నకిలీ రేషన్‌కార్డులు తగ్గుతాయన్న కేంద్ర మంత్రి పాశ్వాన్‌

న్యూఢిల్లీ: ప్రజలు దేశంలో ఎక్కడ్నుంచి అయినా రేషన్‌ సరుకులు తీసుకునేందుకు వీలుగా ఒకే దేశం–ఒకే రేషన్‌ కార్డు(వన్‌ నేషన్‌–వన్‌ రేషన్‌ కార్డ్‌) విధానాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. ఇందుకు 2020, జూన్‌ 30 వరకూ గడువిస్తున్నట్లు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హరియాణా, కేరళ, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, త్రిపుర, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో రేషన్‌ సరుకులు ఎక్కడి నుంచైనా తీసుకునే సదుపాయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయని వెల్లడించారు.

‘2020, జూన్‌ 30 నాటికి దేశవ్యాప్తంగా ఒకే దేశం–ఒకే రేషన్‌ కార్డు విధానం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుకావాలి. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మేం ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు రాశాం. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసవెళ్లే నిరుపేదలు రేషన్‌ సరుకులు పొందలేక ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల నకిలీ రేషన్‌ కార్డులకు అడ్డుకట్ట పడుతుంది. మా ప్రభుత్వం తొలి 100 రోజులు ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చాం’ అని పాశ్వాన్‌ పేర్కొన్నారు.

రేషన్‌ కోసం ఆధార్‌ చూపాల్సిందే..
ఈ నూతన విధానంలో ఓ రాష్ట్రంలోని ప్రజలు మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు రేషన్‌ సరుకుల కోసం ఆధార్‌కార్డును చూపాల్సి ఉంటుందని పాశ్వాన్‌ తెలిపారు. తమ పేర్లు రిజస్టరైన రేషన్‌షాపుల్లో అయితే కేవలం రేషన్‌ కార్డు చూపిస్తే సరిపోతుందని వెల్లడించారు. ఓ రాష్ట్రంలో ఆహారపదార్థాలను ఉచితంగా అందుకునే వ్యక్తి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు మాత్రం రూ.1 నుంచి రూ.3 వరకు కనీసధరను చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.. ‘రేషన్‌కార్డుదారుల్లో 89 శాతం మంది ఆధార్‌తో అనుసంధానమయ్యారు. దేశవ్యాప్తంగా 77 శాతం రేషన్‌ షాపుల్లో పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌(పీవోఎస్‌) యంత్రాలు ఏర్పాటయ్యాయి.

మొత్తం 22 రాష్ట్రాల్లోని రేషన్‌ షాపుల్లో 100 శాతం పీవోఎస్‌ యంత్రాలను అమర్చారు. కాబట్టి కొత్త విధానాన్ని అమలు చేయడానికి ఎలాంటి ఇబ్బందిలేదు’ అని పేర్కొన్నారు. ఈ పథకం దుర్వినియోగం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని పాశ్వాన్‌ చెప్పారు. కుటుంబంలో ఒకరు మరో రాష్ట్రానికి వలసవెళ్లి మొత్తం రేషన్‌ సరుకులు అక్కడే కొనేయకుండా 50 శాతం గరిష్ట పరిమితి విధిస్తున్నామని తెలిపారు. ఒకే దేశం–ఒకే రేషన్‌ కార్డు విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని పాశ్వాన్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి జాతీయ ఆహార భద్రత చట్టం కింద 80 కోట్ల మందికి రేషన్‌షాపుల్లో తక్కువ ధరలకే ఆహారపదార్థాలను అందజేస్తోంది.  

మరిన్ని వార్తలు