డెడ్లీ గేమ్‌పై చేతులెత్తేసిన కేంద్రం

21 Nov, 2017 09:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ సూసైడ్ గేమ్ 'బ్లూ వేల్ చాలెంజ్' పై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. భారత్ సహా పలు దేశాల్లో చిన్నారులతోపాటు, యువత ఆత్మహత్యలకు కారణమవుతున్న ఆన్‌లైన్ గేమ్‌ను నిషేధించలేమని కేంద్రం సోమవారం  సుప్రీకోర్టుకు తెలిపింది  ఎన్క్రిప్టెడ్ లింక్స్ ద్వారా ఒకరి-నుంచి మరొకరికి  కమ్యూనికేట్‌ అవుతోందని..కనుక దీన్ని   బ్యాన్‌  చేయడం కష్టమని  సుప్రీం ముందు నివేదించింది. ఫేస్‌బుక్‌, గూగుల్‌ లాంటి  సోషల్‌ మీడియా దిగ్గజాలు కూడా ఈ విషయంలో నిస్సహాయతను ప్రకటించాయని తెలిపింది.

చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, ఖాన్‌ వికార్‌, చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్‌ ముందు కేంద్ర తరపున  అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ తన వాదన వినిపించారు. అనేకమంది యవతీ యువకుల ప్రాణాలను బలిగొన్న గేమ్‌ను బ్లాక్‌  చేయలేమంటూ కేంద్రం నిస్సహాయతను వ్యక్తం చేసింది.  అనేకమంది శాస్త్రవేత్తలు, టెక్‌ నిపుణులు,  ఇంటర్నెట్ , సోషల్ మీడియా కంపెనీలతో తీవ్రంగా చర్చించినప్పటికీ ఈ  సమస్యకు పరిష్కారం  అంతు చిక్కలేదని స్పష్టం చేసింది. ఎన్‌క్రిప్టెడ్‌ సీక్రెట్‌ కమ్యూనికేషన్స్‌ లింక్స్‌ ద్వారా ఇది విస్తరిస్తోందని అందుకే  ఈ గేమ్‌ను గుర్తించడం, అడ్డగించడం, విశ్లేషించడం కష్టంగా ఉందని తెలిపింది.

రష్యాలో పుట్టి ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న మృత్యు క్రీడ బ్లూవేల్‌పై  దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది.  దీంతో ఈ క్రీడను నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌​ దాఖలైంది. దీన్ని స్వీకరించిన సుప్రీం నిషేధ అంశాన్ని పరిశీలించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. అలాగే ఈ డెడ్లీ గేమ్‌పై పూర్తి అవగాహన కల్పించాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు