వితంతువుకు అండగా నిలిచిన కలెక్టర్

19 Dec, 2015 11:03 IST|Sakshi

పట్నా:  గ్రామస్తుల చేతిలో  అవమానింపబడిన వితంతు మహిళకు  ఓ జిల్లా కలెక్టర్ అండగా  నిలిచారు. అక్కడ రాజ్యమేలుతున్న సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా గ్రామస్తుల్లో అవగాహన కల్పించారు. వితంతు మహిళను తమ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి వంట చేయడానికి వీల్లేదంటూ  ఆందోళన చేపట్టిన గ్రామస్తులను జిల్లా కలెక్టర్  రాహుల్ కుమార్  ఒప్పించి ఆదర్శంగా నిలిచారు.  బిహార్   గోపాల్ గంజ్  జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

 వితంతువు తమ పాఠశాలలో వంట చేస్తే  ఒప్పుకోమంటూ   గోపాల్ గంజ్ జిల్లాలోని కళ్యాణ్ పూర్ గ్రామవాసులు  కొంతమంది ఆందోళనకు దిగారు.  ఆమె చేతి వంట తమ పిల్లలు తింటే అనర్థమని వాదించారు.  స్కూల్  గేట్లకు తాళం వేసి పాఠశాలను నడవనీయమంటూ   మొండి పట్టు పట్టారు. దీంతో వివాదం రేగింది.

విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ కుమార్ ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం పాఠశాలను సందర్శించారు. వితంతు మహిళకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారితో చర్చలు జరిపారు. స్వయంగా ఆమె చేతి  వంటను విద్యార్థులతో కలిసి కలెక్టర్ భుజించారు.  దీంతోపాటుగా  గ్రామస్తుల్లో అవగాహన కల్పించి పరిస్థితిని చక్కదిద్దారు. 


కాగా వివక్ష ఎదుర్కొన్న మహిళకు పాఠశాలలో వంట చేయడం ద్వారా నెలకు 1000 రూపాయలు వేతనం.  ఇద్దరు పిల్లలు  ఉన్న ఆమె కుటుంబానికి అదే ఆధారం. దీంతో. కలెక్టర్, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని తనకు న్యాయం చేయడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు