మసీదుల్లోకి మహిళలను ఎందుకు అనుమతించరు?

8 Feb, 2016 19:58 IST|Sakshi
మసీదుల్లోకి మహిళలను ఎందుకు అనుమతించరు?

న్యూఢిల్లీ: అటు ఇస్లాం దేశాలైనా సౌదీ అరేబియా, ఇరాన్, టర్కీ దేశాల్లో ఇటు అమెరికా, లండన్ లాంటి పాశ్చాత్య దేశాల్లో మసీదుల్లో ప్రార్థనలు చేయడానికి మహిళలను అనుమతిస్తుంటే భారత్ లాంటి దేశాల్లో మాత్రం మసీదుల్లోకి మహిళలను ఎందుకు అనుమతించరన్న వాదన మొదలైంది. తమను కూడా దేశంలోని అన్ని మసీదుల్లోకి అనుమతించాలని కోరుతూ కొంత మంది ముస్లిం మహిళల బృందం సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

భారత్‌లో కూడా 20వ శతాబ్దం వరకు ముస్లిం మహిళలను మసీదుల్లోకి అనుమతించారనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. దేశంలో కొన్ని చోట్ల మహిళలు ప్రార్థనలు చేసుకోవడానికి మసీదుల్లో ప్రత్యేక ఫ్లోర్లను ఏర్పాటు చేయగా, కొన్ని చోట్ల కేవలం మహిళల కోసమే ప్రత్యేక మసీదులను నిర్మించారు. ప్రత్యేకంగా మహిళల ప్రార్థనల కోసం ఏర్పాటు చేసిన విభాగంలో అది మహిళకు మాత్రమే చెందినదని సూచించేందుకు వీలుగా చిహ్నాలు కూడా ఉన్నాయి.

బీజాపూర్‌లో బహమని సుల్తాన్లు నిర్మించినట్లు చెబుతున్న మసీదుల్లో మహిళల ప్రార్థనలకు సంబంధించిన చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా మహిళల కోసమే నిర్మించిన మసీదుల్లో  ఇమామ్‌లు ప్రసగించేందుకు వీలుగా వేదికలు ఉండవు. మహిళల ప్రత్యేక విభాగాల్లో కూడా ఇవి కనపించవు. ఇలాంటి వేదికలు లేనిచోటునే ‘జెనాన (పర్షియన్ భాషలో మిహ ళల కోసం ప్రత్యేకం అనే అర్థం)లు అని వ్యవహరిస్తారని బ్రిటీష్ సర్వేయర్ హెన్రీ కౌసెన్స్ 1916లో ఓ నివేదికలో వెల్లడించారు. బీజాపూర్ ఇబ్రహీం అదిల్ షా 1608లో నిర్మించిన అండా మసీద్ మహిళల కోసం ప్రత్యేకంగా నిర్మించిన మసీదేనని ఆయన కనుగొన్నారు. అందులో రెండో అంతస్తును మహిళల ప్రార్థనల కోసం కేటాయించగా, మొదటి అంతస్తును విశ్రాంత హాలుగా ఉండే దని చెప్పారు. ప్రస్తుతం ఆ మసీదులో రెండో అంతస్తును మగవాళ్ల ప్రార్థనల కోసం కేటాయించగా, కింది అంతస్తులో మదర్సా పాఠశాలను నిర్వహిస్తున్నారు.

మహిళల కోసం నిర్మించిన ప్రార్థనా విభాగం మొజాయిక్ ఫ్లోర్‌తో ప్రత్యేక నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ఢిల్లీలోని ఖువ్వత్ ఉల్ ఇస్లామ్  నుంచి భోపాల్‌లోని తాజ్ ఉల్ మజీద్ వరకు అనేక మసీదుల్లో మహిళల ప్రార్థనకు ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. బీజాపూర్‌లోని అఫ్జల్ ఖానా మసాదులాగా కొన్ని మసీదుల్లో ఒక అంతస్తు మొత్తాన్ని మహిళలకు కేటాయించిన ఆధారాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లోని అతలా మసీదు, లాల్ దర్వాజ మసీదు, బరోడాలోని జమా మసీదులు కూడా ఈ కోవకు చెందినవే. బరోడా జమా మసీదులోకి మహిళలు ఎవరికి కనిపించకుండా పై అంతస్తుకు వెళ్లేందుకు ప్రత్యేక మెట్ల దారి కూడా ఉందని బ్రిటన్ సర్వేయర్ కనుగొన్నారు. మసీదుల్లో మహిళల ప్రార్థనా మందిరాలకు ప్రహారీ గోడలు ఎత్తుగా ఉండడం మరో ప్రత్యేకతని ఆయన తెలిపారు.

ముస్లిం మహిళలు మసీదులకు వెళ్లకుండా ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని, వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే గదిలో ప్రార్థనలు చేయడం మంచిదని మొహమ్మద్ ప్రవక్త సూచించిన నేపథ్యంలో మహిళలను మసీదుల్లోకి అనుమతించడం లేదని మతఛాందసవాదులు చెబుతుండగా, ఆ భావన పూర్తిగా తప్పని, చంటి పిల్లలను సాకాల్సిన తాము మసీదుల్లోకి వెళ్లి ఎక్కడ ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంటోందని కొంతమంది చంటి పిల్లల తల్లులు అప్పట్లో ప్రవక్తను ప్రశ్నించగా, అలాంటి మహిళలు ఇంట్లోను ప్రార్థనలు చేసుకోవచ్చని ఆయన సూచించారన్నది అభ్యుదయవాదుల వాదన.

మరిన్ని వార్తలు