రాజీనామాకు గవర్నర్లు ససేమిరా

19 Jun, 2014 03:22 IST|Sakshi
రాజీనామాకు గవర్నర్లు ససేమిరా

* తగిన సంస్థ కోరితేనే ఆలోచిస్తానన్న మహారాష్ట్ర గవర్నర్
* కేంద్రంపై కర్ణాటక, నాగాలాండ్ గవర్నర్ల మండిపాటు

 
 న్యూఢిల్లీ/ముంబై: రాజీనామా చేయాలని కేంద్రం తమపై తెస్తున్న ఒత్తిడిని మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్ సహా పలువురు గవర్నర్లు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్లలో కొందరిని పదవులను నుంచి తప్పుకోవాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కోరడం తెలిసిందే. అయితే కేంద్రం ఒత్తిడి పెంచుతున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు.
 
 తగిన నిర్ణయాత్మక సంస్థ కోరితేనే రాజీనామా అంశాన్ని పరిశీలిస్తానని శంకరనారాయణన్ బుధవారం ఓ టీవీ చానల్‌తో అన్నారు. అనిల్ గోస్వామి గత వారం తనతో రెండు సార్లు మాట్లాడారని, తాను జవాబు చెప్పలేదని వెల్లడించారు. ‘గవర్నర్ పదవి రాజ్యాంగ పదవి. ఆయన రాష్ట్రపతి ప్రతినిధి.. పదవి నుంచి తప్పుకోవాలని బాధ్యతాయుత వ్యక్తులెవరూ నన్ను రాతపూర్వకంగా అడగలేదు’ అని చెప్పారు.
 
  రాజీనామా చేస్తారని భావిస్తున్న నాగాలాండ్ గవర్నర్ అశ్వనీ కుమార్ కేంద్రం యత్నాన్ని రాజకీయ కక్షగా అభివర్ణించారు. ఎన్డీఏ ప్రభుత్వం తనకిష్టమైన వారే గవర్నర్లుగా ఉండాలని కోరుకుంటోందా అని ప్రశ్నించారు. తన రాజీనామా అంశాన్ని కర్ణాటక గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్ తోసిపుచ్చారు. ‘రాజ్యాంగం ప్రకారం గవర్నర్లు రాజీనామా చేయరు. తమ స్థానంలో కొత్తవారు వచ్చేంతవరకు పదవుల్లో కొనసాగుతారు. ఈ విషయంలో బాధ్యతారహితంగా ఎలా వ్యవహరిస్తారు?’ అని మండిపడ్డారు. భరద్వాజ్ బుధవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకుని రాజీనామాలోని సమస్యల గురించి మాట్లాడారు. ఆయన గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి అపాయింట్‌మెంట్ కోరారు. కాగా, తాను రాజీనామా చేయలేదని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు