రైల్వే టెండర్ల ప్రక్రియలో సంస్కరణలు

3 Jan, 2015 02:58 IST|Sakshi

న్యూఢిల్లీ: రైల్వేలో పారదర్శకతను పెంచేందుకు, టెండర్ల ప్రక్రియ వేగవంతమయ్యేందుకు ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు కీలక నిర్ణయం తీసుకున్నారు. టెండర్ల ప్రక్రియలో తన జోక్యం లేకుండా తప్పుకొన్నారు. వాటి ఖరారు బాధ్యతను రైల్వే జోన్లకు, ఉత్పత్తి విభాగాల అధిపతులకే అప్పగించారు. ప్రస్తుతం రైల్వే టెండర్ల ఖరారులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో రైల్వేల్లో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ  టెండర్ల ప్రక్రియను మంత్రి సులభతరం చేశారు.

ప్రతి దాన్ని రైల్వే బోర్డు ఆమోదానికి పంపకుండా, సోర్స్ అండ్ వర్క్స్ విభాగ పనులకు టెండర్లను ఆమోదించే బాధ్యతను జోనల్ రైల్వేలకు, ఉత్పత్తి విభాగాలకు కట్టబెట్టారు. ఆయా విభాగాల జనరల్ మేనేజర్, డెరైక్టర్ జనరల్‌కే పూర్తి అధికారాలు ఉంటాయని శుక్రవారం రైల్వే శాఖ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇకపై రూ. 500 కోట్లకంటే ఎక్కువ విలువ గల పనులకు సంబంధించిన టెండర్లను మాత్రమే బోర్డు స్థాయిలో ఆమోదిస్తారు.
 

మరిన్ని వార్తలు