అక్కడ పెళ్ళికి ముందే హెచ్ఐవీ పరీక్షలు!

22 Jan, 2016 20:31 IST|Sakshi
అక్కడ పెళ్ళికి ముందే హెచ్ఐవీ పరీక్షలు!

ఆ గ్రామస్థులు... గ్రామ పెద్దల నిర్ణయాన్ని శిరసా వహిస్తున్నారు. హర్యానా భివానీ జిల్లాలోని చందేని గ్రామంలో పంచాయితీ సభ్యులు చేసిన ప్రత్యేక తీర్మానానికి ప్రజలంతా ఆమోదం తెలిపారు. వివాహానికి ముందే వధూవరులు  హెచ్ఐవీ పరీక్షలను చేయించుకోవాలన్న ఆలోచనను ప్రోత్సహిస్తున్నారు.

సర్పంచ్ మమతా సంగ్వాన్ తో సహా పదిమంది పంచాయితీ సభ్యులను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారంతా ఇప్పుడు గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడపడంతోపాటు... స్థానిక ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఇందులో భాగంగానే వివాహానికి ముందు వధూవరులు  హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.  గ్రామ పెద్దల ఆలోచనతో ఏకీభవించిన ధరమ్ జిత్ గ్రేవాల్, ముఖేష్ రాణిలు తమ  హెచ్ఐవీ రిపోర్టులను సర్పంచ్ కు అందజేశారు.  గ్రామస్తుల్లో ఎక్కువశాతం విద్యావంతులేనని, వారందరికీ వ్యాధివల్ల వచ్చే సమస్యలు, ఇబ్బందులు తెలుసునని అందుకే పంచాయితీ తీర్మానాన్ని ఆమోదించి తాము పరీక్షలు చేయించుకున్నామని ధరమ్ జిత్ గ్రేవాల్ అన్నారు. ముందుగానే పరీక్షలు చేయించుకొని పంచాయితీ పెద్దలను రిసెప్షన్ కు ఆహ్వానించి అందరి సమక్షంలో వారికి రిపోర్టులు సమర్పించామని తెలిపారు.

తనకు ఈ ఆలోచనను గ్రామ కార్యకర్త, రంగస్థల నటుడు అయిన సంజయ్ రాంఫాల్ సూచించారని,  అయితే తమ ఆలోచన తప్పనిసరిగా అమలవుతుందన్న నమ్మకం గట్టిగా ఉందని సర్పంచ్ మమత చెప్తున్నారు. అంతేకాక వివాహం చేసుకున్న నూతన దంపతులకు ఓ తులసి మొక్కను బహూకరించి, వారితో ప్రతిజ్ఞ కూడ చేయించేందుకు పంచాయితీ సభ్యులు నిర్ణయించారు.  హెచ్ఐవీ ఎన్నో జీవితాలను బలి చేస్తోందని, ఆ వ్యాధితో తమ గ్రామంలో ఎవరూ మరణించకూడదన్నదే తమ లక్ష్యమని పంచాయితీ సభ్యులు అంటున్నారు. తమ గ్రామంలోనే కాక పరిసర గ్రామాల ప్రజలకు కూడ  హెచ్ఐవీపై అవగాహన కల్పించేందుకు ప్రయత్సిస్తున్నామని వారు చెప్తున్నారు.

మొదటి మహిళా గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన మమత పట్టభద్రు రాలు. ఆమె భర్త హితేష్ ఆర్మీలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అయితే గ్రామస్థుల ఆరోగ్యమే ధ్యేయంగా తీసుకున్న ఈ నిర్ణయం... వధూవరులకు అంగీకారమైతేనే పాటించవచ్చని, టెస్టులు చేయించుకోడానికి ఎటువంటి బలవంతం లేదని ఆమె చెప్తున్నారు.

>
మరిన్ని వార్తలు