135 ఏళ్ల ఐకమత్యం.. 135 ఏళ్ల సమానత్వం

28 Dec, 2019 12:10 IST|Sakshi

నేడు కాంగ్రెస్‌ పార్టీ 135వ వ్యవస్థాపక దినోత్సవం

న్యూఢిల్లీ : ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ 135వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎంపీ రాహుల్‌ గాంధీ సహా ఇతర ముఖ్య నేతలంతా ఢిల్లీలోని అక్బరు రోడ్డులో గల పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. శనివారం నాటి ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సోనియా గాంధీ నాయకులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ‘135 ఏళ్ల ఐకమత్యం.. 135 ఏళ్ల న్యాయం.. 135 ఏళ్ల సమానత్వం.. 135 ఏళ్ల అహింస... 135 ఏళ్ల స్వాతంత్ర్యం.. ఈరోజు ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ 135వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకొంటోంది. పార్టీ కంటే మాకు దేశమే ముఖ్యం’ అంటూ పార్టీ ఆవిర్భావం, స్వాతంత్రోద్యమం నాటి ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఇక కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాహుల్‌ గాంధీ సైతం అరుదైన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఏఐసీసీ కార్యాలయంలో జరగిన కార్యక్రమానికి హాజరైన తర్వాత అసోంలోని గువాహటిలో జరుగనున్న ర్యాలీలో పాల్గొంటానని పేర్కొన్నారు. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా.. ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌- సేవ్‌ ఇండియా’ పేరిట దేశవ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ అసోం, ప్రియాంక గాంధీ లక్నోలో పర్యటించనున్నారు.(రాహుల్‌ గాంధీ వెరైటీ డాన్స్‌ చూశారా?)

ఇదిలా ఉండగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్‌)ను వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సత్యాగ్రహ దీక్షకు పూనుకుంది. తిరంగా ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే ఇందుకు పోలీసుల అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అక్కడికి వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. కాగా పోలీసులు, ప్రభుత్వం తీరుపై టీపీసీసీ చీఫ​ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడుతున్నారు. దీక్షను అడ్డుకుంటామంటున్న ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీకి ఎలా అనుమితినిచ్చింది అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు