సర్వం సిద్ధం

27 Aug, 2014 22:20 IST|Sakshi

సాక్షి, ముంబై: గణేష్ ఉత్సవాలకు నగర పోలీసు శాఖ సన్నద్ధమైంది. భద్రతను దృష్టిలో ఉంచుకుని నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో భక్తులు, స్థానిక ప్రజలు, మండలి కార్యకర్తలు, స్వయం సేవా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా కోరారు.

 ఉత్సవాలను పురస్కరించుకుని పోలీసులకు వారాంతపు సెలవులు, దీర్ఘకాలిక సెలవులు రద్దుచేశారు. దీంతో నగర పోలీసు శాఖ ఆధీనంలో ఉన్న మొత్తం 45 వేల మంది పోలీసు సిబ్బంది విధులకు అందుబాటులో ఉన్నట్లే.. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు ఐదు రకాల పోలీసు బలగాలను మోహరించినట్లు మారియా చెప్పారు. ఇందులో నేర నిరోధక శాఖ, ఉగ్రవాద నిరోధక శాఖ, రద్దీ నియంత్రణ, అత్యవసర దళం, ధార్మక స్థలాల భద్రత దళాలు ఉన్నాయని ఆయన అన్నారు. రద్దీ సమయంలో అమ్మాయిలను ఈవ్‌టీజింగ్ చే సే ఆకతాయిల ఆటకట్టించేందుకు సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా నిఘా వేయనున్నారు.

ఇప్పటికే ముంబై వివిధ ఉగ్రవాద సంస్థల హిట్ లిస్టులో ఉంది. ముష్కరులు ఎప్పుడు, ఏ రూపంలో వచ్చి దాడులు చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే వివిధ రహదారులన్నింటిపై పోలీసులు నిఘావేశారు. సముద్రతీరాల వెంబడి గస్తీ నిర్వహించే కోస్టు గార్డులను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో వాహనాల తనఖీలు, నాకా బందీలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో సెప్టెంబర్ రెండు, నాలుగు, ఏడు, ఎనిమిది తేదీల్లో ఉదయం ఆరు గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు లౌడ్‌స్పీకర్ల వినియోగానికి పోలీసు శాఖ అనుమతినిచ్చింది.

నిమజ్జనం సమయంలో చిన్న పిల్లలు తప్పిపోతే వారి ఆచూకీ కోసం ఫిర్యాదు చేసేందుకు జూహూ, గిర్గావ్ (చర్నిరోడ్ చౌపాటి), బాంద్రా, పవాయి, శివాజీపార్క్ తదితర నిమజ్జన ఘాట్‌లవద్ద ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తమ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తుల వాహనాల పార్కింగ్‌కు అనుమతినివ్వకూడదని వ్యాపారవర్గాలకు అసిస్టెంట్ పోలీసు కమిషనర్ జి.కె.ఉపాధ్యాయ్ సూచించారు.

 బీఎంసీ ఏర్పాట్లు...
 విగ్రహాలు నిమజ్జన ం చేసే సముద్రతీరాల (ఘాట్‌ల) వద్ద మహానగర పాలక సంస్థ (బీఎంసీ) తగిన ఏర్పాట్లు పూర్తిచేసింది. సుమారు 10 వేల మంది బీఎంసీ సిబ్బందిని నియమించింది. వాచ్ టవర్లు, ఫ్లడ్ లైట్లు, 400 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచినట్లు బీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.వి.ఆర్.శ్రీనివాసన్ చెప్పారు. ప్రతి నిమజ్జన ఘాట్‌వద్ద 8-10 సీసీటీవీ కెమెరాల చొప్పున మొత్తం నిమజ్జన ఘాట్లవద్ద 258 కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. సముద్ర తీరాలకు వచ్చిన భక్తులకు సంచార టాయిలెట్లు, తాత్కాలిక తాగునీరు కుళాయిలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు బీఎంసీ పరిపాలనా విభాగం రూ.13-15 కోట్లు ఖర్చుచేస్తోంది.

మరిన్ని వార్తలు