ట్రాఫిక్ సమస్య తీరేదెట్టా ?

17 Jul, 2014 23:22 IST|Sakshi
ట్రాఫిక్ సమస్య తీరేదెట్టా ?

సాక్షి, ముంబై : నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. రోజురోజుకూ ప్రైవేట్ వాహనాల సంఖ్య అధికమవుతుండడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు బస్సుల కోసం ప్రత్యేకంగా లేన్లను కేటాయించాలనే అంశం కొత్తేమీ కాదు. అహ్మదాబాద్, ఢిల్లీ లాంటి నగరాలలో బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (బీఆర్‌టీఎస్) వ్యవస్థ అమల్లో ఉంది. కానీ ఈ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడంలో ముంబై విఫలమైంది. నగరవాసులకు ట్రాఫిక్ అవస్థలు తప్పడం లేదు. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి నగర వాసులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మరింత మెరుగైన సౌకర్యాలతో రవాణా వ్యవస్థను తీర్చి దిద్దాల్సి ఉంటుంది.

 నిపుణుల సూచనలు
 నగర వాసుల ప్రయాణ సమయం మరింత ఆదా చేసే విధంగా ప్రత్యేక బస్ లేన్లను ఏర్పాటు చేయాలి. ఇందుకు చిన్న ఏసీ బస్సులను ప్రవేశపెడితే ట్రాఫిక్ సమస్య కొంత మేర తీరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ప్రజలు ప్రైవేట్ వాహనాలు ఉపయోగించకపోవడంతో రోడ్లపై కొంత మేర రద్దీ తగ్గి ట్రాఫిక్ సులభతరం అవుతోంది. ప్రత్యేక లేన్ కేటాయిండం ద్వారా వీటి మీద నుంచి వెళ్లే బస్సులకు ఆధరణ పెరిగి వాహనదారులు కూడా  బస్సుల్లోనే వెళ్లేందుకు ఇష్టపడతారు.  రోడ్లపై ప్రైవేట్ వాహనాల రద్దీ తగ్గుతోందని రవాణా శాఖ నిపుణులు అశోక్ దాతర్ అభిప్రాయపడ్డారు.  చిన్న ఏసీ బస్సులను రద్దీ సమయంలో ప్రవేశపెట్టాలన్నారు. బస్సులు, రైళ్లు ప్రైవేట్ వాహనాల ద్వారా వెళ్లడంతో ప్రయాణ సమయం పెరుగుతోందని చెబుతున్నారు. తమ ప్రైవేట్ కార్లకు స్వస్తి చెప్పి పబ్లిక్ రవాణాను ఉపయోగించాలని ప్రజలకు సూచిస్తున్నారు.

 లేన్ల ఏర్పాటుపై అధ్యయనం
 ఇందుకు సంబంధించిన నివేదికను ముంబై ట్రాన్స్‌పోర్ట్ ఫోరం... బృహన్‌ముంబై ఎలక్ట్రిసిటీ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్)కు  ప్రతిపాదన పంపించారు. బెస్ట్ ఈ బస్సులను బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), బాంద్రా స్టేషన్‌ల మధ్య నడపడానికి ప్రతిపాదించారు. బీకేసీతో పాటు మరే ఇతర ప్రాంతాలలో ఈ ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేయాలనే అంశంపై అధ్యయనం నిర్వహించామని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఏఏ ప్రాంతాలలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో తదితర అంశాలను కూడా అధ్యయనం చేశామని అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) క్వైజర్ ఖాలిద్ పేర్కొన్నారు. గతంలో ప్రవేశపెట్టాలనుకున్న బీఆర్‌టీఎస్, ప్రత్యేక లేన్లకు ట్యాక్సీ డ్రైవర్లు, వాహన చోదకుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దీంతో ఈ ప్లాన్ ప్రారంభంలోనే క్లిష్టంగా మారింది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించామని అధికారి తెలిపారు.

 మినీ బస్సుల ఏర్పాటుకు నిర్ణయం
 నగర వాసుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేసేందుకు ఐదేళ్ల క్రితం బెస్ట్ సంస్థ ఏసీ బస్సులను నడిపించింది. కారు వినియోగ దారులు కూడా దీనికి ఆకర్షితులవుతారని భావించింది. కానీ బస్సు ప్రయాణం కార్లు, ద్విచక్రవాహనాల కంటే ఎక్కువ సమయం పడుతుండడంతో ప్రయాణించే సమయం ఎక్కువైంది. ఆశించిన ఫలితం దక్కలేదు.  కొత్తగా మినీ ఏసీ బస్సులను నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ బస్సుల్లో 20 నుంచి 25 మంది వరకు ప్రయాణికులు కూర్చునే వీలు ఉంటుంది.

 అంతేకాకుండా ఈ మినీ బస్సుల ద్వారా రోడ్లపై త్వరగా రద్దీ కూడా తగ్గుతోంది. ఈ బస్సుల ద్వారా ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. నగర వాసులకు సౌకర్యవంతమైన రవాణా అంటే ఇంటి దగ్గరే బస్సులను నిలపాలి. అలా చేస్తే ఇక వారు కార్లను ఉపయోగించరని దాతర్ అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ మినీ బస్సులను నిర్వహించవచ్చన్నారు.

మరిన్ని వార్తలు