గురు దేవో భవ..

18 Nov, 2018 01:39 IST|Sakshi

టీచింగ్‌ను  గౌరవిస్తున్న భారతీయులు

భారతీయ తల్లిదండ్రులు ఇంజనీరింగ్‌ ఇతర ప్రొఫెషనల్‌ కోర్సుల కంటే ఉపాధ్యాయ వృత్తిపైనే అధిక ఆసక్తి కనబరుస్తున్నారు. 54 శాతం మంది తమ పిల్లలు బోధనా రంగంలోకి వచ్చేలా ప్రోత్సహిస్తామంటున్నారు. వార్కే ఫౌండేషన్‌ 35 దేశాల్లోని 16– 64 వయస్కులౖ పె సర్వే జరిపింది.

వార్కే రూపొందించిన అంతర్జాతీయ అధ్యాపక స్థితిగతుల సూచి– 2018 ప్రకారం.. పిల్లల్ని ఉపాధ్యాయులుగా చూడాలని కోరుకుంటున్న పెద్దలు మన దేశంలోనే ఎక్కువ. చైనా మన తర్వాత స్థానం (50శాతం)లో ఉంది. బ్రిటన్‌లో 23 శాతం మంది తల్లిదండ్రులు బోధనా రంగం వైపు వచ్చేలా తమ పిల్లలను ప్రోత్సహిస్తామంటున్నారు. ఇలా ఆలోచిస్తున్న పెద్దలు రష్యాలో అతి తక్కువ కేవలం 6శాతమే.

టీచర్ల స్థితిగతుల సూచిలో 8వ స్థానం
అంతర్జాతీయంగా విద్యా ప్రమాణాల మెరుగు దలపై దృష్టి పెట్టి వార్కే ఫౌండేషన్‌ టీచర్ల పట్ల సమాజ ధోరణిపై సమగ్ర సర్వే జరిపి ఈ సూచి తయారు చేసింది. దీని ప్రకారం ఉపాధ్యాయ స్థితిగతుల సూచిలో చైనాకి మొదటి ర్యాంకు లభించగా, భారత్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది. బ్రెజిల్‌ చివరి స్థానంలో నిలవగా.. మలేసియా, తైవాన్‌ వరుసగా రెండు, మూడు స్థానాలు పొందాయి. అంతర్జాతీయంగా టీచర్ల ప్రతిపత్తి పెరుగుతున్నట్టు తాజా సర్వే తేల్చి చెప్పింది. ఐరోపా, పాశ్చాత్య దేశాల్లో కంటే ఆసియా దేశాలైన ఇండియా, చైనా, మలేసియా, తైవాన్, ఇండోనేసియా, కొరియాల్లో టీచర్లు మెరుగైన ప్రతిపత్తి కలిగి వున్నారని ఆ సూచి వెల్లడించింది.


హెడ్‌ మాస్టర్‌.. ది గ్రేట్‌
విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవిస్తారంటున్న దేశాల్లో చైనా (81%) ముందుంది. ఉగాండా (79%), భారత్‌ (77%) రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. బ్రెజిల్‌ ఆఖరి స్థానం (9%)లో ఉంది.  
భారతీయులు పదికి 7.11 రేటింగ్‌ ఇవ్వడం ద్వారా మన విద్యా విధానం మెరుగైనదని (4వ స్థానం) ఇచ్చారు. ఫిన్లాండ్‌ (8) స్విట్జర్లాండ్‌ (7.2)) సింగపూర్‌ (7.1) పెద్దలు కూడా తమ విద్యావిధానాన్ని బాగానే విశ్వసిస్తున్నారు. ఈ విషయంలో ఈజిప్ట్‌ (3.8శాతం) ఆఖరి స్థానంలో నిలిచింది.  
డాక్టర్లు, హెడ్‌మాస్టర్లు, ప్రైమరీ, సెకండరీ టీచర్లు, నర్సులు సోషల్‌ వర్కర్లు, లైబ్రేరియన్లు తదితరæ 14 వృత్తి ఉద్యోగాల్లో హెడ్‌మాస్టర్లకు గౌరవపరంగా నాలుగో ర్యాంకు ఇస్తామని భారతీయులు చెప్పారు. ఈ విషయంలో మలేసియా, ఇండోనేసియా, చైనా మన కంటే ముందున్నాయి. మలేసియా, చైనాల్లో టీచర్లను డాక్టర్లతో పోల్చుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
సెకండరీ స్కూలు టీచర్లకు మన వాళ్లు ఏడో ర్యాంకు ఇవ్వగా, చైనా వారికి మొదటి స్థానం కట్టబెట్టింది.


వార్కే ఫౌండేషన్‌ 2013లో కూడా 21 దేశాల్లో సర్వే జరిపి ఇలాంటి సూచిని తయారు చేసింది. అప్పట్లో టీచర్లు ప్రతిపత్తిపరంగా దిగువ స్థానంలో ఉన్న దేశాలు ఈ ఐదేళ్లలో పుంజుకోవడాన్ని సర్వే నివేదిక ప్రస్తావించింది. కాగా, అసాధారణంగా పనిచేసిన టీచర్లను ప్రోత్సహించేందుకు వార్కే ఫౌండేషన్‌ గతంలో గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ ప్రవేశపెట్టింది.

మరిన్ని వార్తలు