క‌రోనా: డెక్సామెథాసోన్‌కు కేంద్రం అనుమ‌తి

27 Jun, 2020 18:13 IST|Sakshi

న్యూఢిల్లీ : క‌రోనా వైర‌స్‌తో బాధ‌ప‌డుతున్న వా‌రికి డెక్సామెథాసోన్ స్టెరాయిడ్‌ను ఉప‌యోగించేందుకు శ‌నివారం కేంద్ర ప్ర‌భుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కేవ‌లం క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో ఉన్న రోగుల‌కు మాత్ర‌మే డెక్సామెథాసోన్ వాడాల‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. ఆర్థరైటిస్, ఆస్త‌మా వంటి తీవ్ర‌మైన వ్యాధి ప‌రిస్థితుల్లో ఉప‌యోగించే డెక్సామెథాసోన్‌ను క‌రోనాతో వెంటిలేర్‌పై ఉన్న వారికి, ఆక్సిజ‌న్ స‌హాయం కావాల్సిన వారికి ఎక్కువ ధ‌ర‌తో కూడిన మిథైల్‌ప్రిడ్నిసోలోన్‌కు ప్ర‌త్యామ్నాయంగా త‌క్కువ ఖ‌ర్చుతో కూడిన‌ మెథాసోన్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని పేర్కొంది. ఈ డెక్సామెథాసోన్‌పై బ్రిట‌న్‌లో అనేక క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ జ‌రిగిన అనంత‌రం ప్రపంచ వ్యాప్తంగా ఈ స్టెరాయిడ్‌ ఉత్పత్తిని పెంచాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల పిలుపునిచ్చింది. (కరోనాకు ఇందులో ఏది సరైన మందు?)

ఇటీవ‌ల ఆక్స్‌ఫర్డ్‌ విశ్వ‌విద్యాలయం నుంచి వ‌చ్చిన ఓ బృందం నేతృత్వంలోని ప‌రిశోధ‌కులు క‌రోనాతో ఆస్ప‌త్రిలో చేరిన 2 వేల మందికి పైగా రోగుల‌కు డెక్సామెథాసోన్ ఇచ్చారు. అయితే వీరిలో వెంటిలేట‌ర్ ద్వారా చికిత్స పొందుతున్న వారు, ఆక్సిజ‌న్ స‌హాయం అందిస్తున్న వారి మ‌ర‌ణాల‌ను రేటును 35 శాతం త‌గ్గించింది. త‌క్కువ ధ‌ర‌కు ల‌భించే స్టెరాయిడ్ గ‌త 60 ఏళ్లుగా మార్కెట్లో ల‌భిస్తోంది. కాగా భార‌త్‌లో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చుతోంది. శ‌నివారం కొత్త‌గా 18,552 పాజిటివ్ కేసులు వెలుగు చూడ‌గా, మొత్తం కేసుల సంఖ్య 5,08,953కు చేరింది. క‌రోనాతో తాజాగా 384 మంది మృత్యువాత పడ‌గా.. ఇప్పటి వ‌ర‌కు మొత్తం 15,685 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో అత్య‌ధికంగా ప్ర‌భావిత‌మైన దేశాల‌లో భార‌త్ నాలుగో స్థానంలో ఉంది. (క‌రోనా: రెమ్డిసివిర్ మొద‌ట ఆ అయిదు రాష్ట్రాల‌కే)

మరిన్ని వార్తలు