గల్వాన్‌ ఘటన : మరో జవాన్‌ వీరమరణం

25 Jun, 2020 16:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌-చైనా మధ్య గల్వాన్ లోయలో ఈ నెల 15న జరిగిన సరిహద్దు సైనిక ఘర్షణకు సంబంధించి మరో జవాను అమరుడయ్యారు. మహారాష్ట్రలోని మలేగావ్‌ తాలూకా సాకురి గ్రామానికి చెందిన సచిన్‌ విక్రమ్‌ మోరే గురువారం వీరమరణం పొందారు. గల్వాన్‌లో విధినిర్వహణలో ఉండగా, నదిలో పడిపోయిన ఇద్దరిని కాపాడే ప్రయత్నంలో విక్రమ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా, గురువారం అమరుడైనట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. దీంతో గల్వాన్‌ ఘర్షణలో మరణించిన భారత జవాన్ల సంఖ్య 21కు పెరిగింది. (చదవండి : చైనా, భారత్‌ వ్యూహాలు ఏమిటి?)

తెలంగాణ ముద్దుబిడ్డ కర్నల్ సంతోష్‌బాబు సహా 20మంది జవాన్లు అమరులైనట్టు ఇండియన్‌ ఆర్మీ ఇప్పటికే ప్రకటించింది. అయితే చైనా మాత్రం మరణాల సంఖ్యపై నోరు విప్పడంలేదు. 40మందికిపైగా సైనికులు మరణించినట్టు అంచనా వేస్తుండగా.. డ్రాగన్‌ ఆర్మీ మాత్రం కమాండర్ స్థాయి అధికారి సహా ఇద్దరు మాత్రమే మరణించినట్టు అధికారికంగా ప్రకటించింది. మరోవైపు భారత్‌-చైనాల మధ్య సరిహద్దు వివాదంపై చర్చలు జరుగుతున్నాయి. సరిహద్దుల్లోని ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకుందామని ఒకపక్క భారత్‌కు చెబుతూనే మరోపక్క తూర్పు లద్దాఖ్‌ సహా పలు ప్రాంతాల్లో తన బలగాలను విస్తరిస్తోంది. భారత్‌ కూడా తన యుద్ధ విమానాలతో ఆ ప్రాంతంలో విన్యాసాలు చేయించింది. దీంతో లద్దాఖ్‌లోఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. (చదవండి : గల్వాన్‌ ఘటనతో వణికిన చైనా సైన్యం)

మరిన్ని వార్తలు