క‌రోనా: రెమ్‌డిసివిర్ వాడేందుకు భార‌త్ అంగీకారం

2 Jun, 2020 19:32 IST|Sakshi

క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో మెరుగైన ఫ‌లితాలు

న్యూఢిల్లీ: మందు, వ్యాక్సిన్ ఏదీ అందుబాటులో లేని కరోనాను నివారించ‌డం ప్ర‌భుత్వాల‌కు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. మ‌రోవైపు కోవిడ్‌ను త‌రిమికొట్టేందుకు వ్యాక్సిన్ త‌యారు చేయ‌డంలో శాస్త్రవేత్త‌లు త‌ల‌మున‌క‌ల‌య్యారు. ఈ క్ర‌మంలో భార‌త ప్ర‌భుత్వం కరోనా రోగుల‌కు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో రెమ్‌డిసివిర్ ఔష‌ధాన్ని వాడేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. "ఎమ‌ర్జెన్సీ స‌మ‌యాల్లో ఈ ఔష‌ధాన్ని వినియోగించేందుకు జూన్ 1న అనుమతులిచ్చాం. అయితే ఐదు డోసులు మాత్ర‌మే ఇవ్వాలి" అని డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జెన‌ర‌ల్ ఆఫ్ ఇండియా ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కాగా ఈ మందు మొద‌టి క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లోనే కోవిడ్ పేషెంట్‌ల‌పై మెరుగైన ప్ర‌భావం చూపిన‌ట్లు తేలింది. దీంతో అమెరికా ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ దీని వినియోగానికి గ‌త నెల‌లోనే ఆమోదం తెలిపింది. (విస్తృత ప్రయోగ దశకు కరోనా టీకా)

అయితే అత్య‌వ‌స‌ర స‌మయంలోనే దీన్ని వినియోగించాల‌ని పేర్కొంది. అటు జ‌పాన్ ప్ర‌భుత్వం కూడా అత్యవసర ప్రాతిపదికన కోవిడ్‌-19 బారినపడిన వారి చికిత్సకు వినియోగిస్తోంది. యాంటీవైరల్‌ ఔషధం రెమ్‌డెసివిర్‌కు పేటెంట్‌ కలిగిన గిలియడ్‌ సైన్సెస్‌ ఇటీవల దేశీ ఫార్మా రంగ దిగ్గజాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. సిప్లా, జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, హెటెరో ల్యాబ్స్‌తో నాన్‌ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందాలను చేసుకుంది. ఫ‌లితంగా ఈ కంపెనీలు రెమ్‌డిసివిర్‌ను దేశీయంగా త‌యారు చేసి అందుబాటులోకి తేనుంది. ఇదిలా వుండ‌గా మంగ‌ళవారం నాటికి దేశంలో 1,98,706 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. (దేశీ వినియోగానికి రెమ్‌డెసివిర్‌ ఔషధం!)

మరిన్ని వార్తలు