హిమాలయాల్లో మరోసారి యతి జాడలు 

1 May, 2019 08:54 IST|Sakshi

ఫొటోలు, వీడియోలు విడుదల చేసిన ఆర్మీ  

న్యూఢిల్లీ : తరతరాలుగా చెప్పుకుంటున్న యతి వింతజీవి మరోసారి వార్తల్లోకి వచ్చింది. యెతి పాదముద్రలను తాము గుర్తించామంటూ భారతసైన్యం తాజాగా ఫొటోలు, వీడియోలను విడుదల చేసింది. యతి అనే వింతజీవి మానవుల కన్నా పెద్ద పరిమాణంలో, కోతి లేదా ఎలుగుబంటి ఆకారంలో ఉండి, ఒళ్లంతా వెంట్రుకలు ఉంటాయనీ, హిమాలయాలు, సైబీరియా, మధ్య, తూర్పు ఆఫ్రికా ప్రాంతాల్లో ఈ జీవి నివసిస్తుందని వందల సంవత్సరాల నుంచి చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన కథలు ఒక తరం నుంచి మరో తరానికి చేరుతున్నాయి తప్ప యతిని ప్రత్యక్షంగా చూసిన వాళ్లు ఇప్పటివరకు ఎవరూ లేరనే చెప్పాలి. ఏప్రిల్‌ రెండో తేదీన ఆర్మీ టీం ఒకటి ప్రపంచంలోనే ఐదో అత్యంత ఎత్తైన శిఖరం, నేపాల్‌లోని మకాలును అధిరోహించేందుకు వెళ్లింది. ఏప్రిల్‌ 9న వారికి మకాలు బేస్‌ క్యాంపు వద్ద 32X15  అంగుళాల పరిమాణంలో ఉన్న పాదముద్రలు కనిపించాయనీ, వాటి ఫొటోలు, వీడియోలను ఉపగ్రహ వ్యవస్థ ద్వారా తమకు పంపారని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు